
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని హున్సా గ్రామంలో ఏటా హోలీ పండుగ రోజున నిర్వహిస్తున్న పిడిగుద్దులాటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 125ఏళ్ల ఆనవాయితీకి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రతీ సంవత్సరం హోలీ పండుగ రోజు ఆత్మీయ ఐక్యతతో కుల, మతాలకు అతీతంగా పిడిగుద్దులాట కొనసాగించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే పిడిగుద్దులాటకు ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్థులకు పోలీసులు నోటీసులు పంపించారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ టీవీ9 తో మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్న నూతన పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు హోలీ పండుగ రోజు హున్సా పిడిగుద్దులాటకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. హోలీ పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పోలీసు నోటీసులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పిడిగుద్దులాటకు పోలీసుల అనుమతి లేదంటూ నోటీసులు రావడంతో గ్రామపెద్దలు, పిడిగుద్దులాట నిర్వాహకులు సమావేశమయ్యారు. ఇన్నేళ్లుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పిడిగుద్దులాట కొనసాగిద్దామా? వద్దా ? అనే సందిగ్ధంలో పడ్డారు. పోలీసుల అనుమతి కోసం గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.. ఏళ్లుగా వస్తున్న తమ పిడిగుద్దులాట ఆ చారాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తామని పోలీసులు అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఈరోజు పిడి గుద్దులాట జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అనుమతిస్తే సాయంత్రం 6 గంటలకు పిడి గుద్దులు ప్రారంభం అవుతాయి.
అయితే గతంలో ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడి ఆనవాయితీని కొనసాగించారు. ఈ ఏడాది కూడా అదే తంతు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిడిగుద్దుల ఆటను తిలకించడానికి బోధన్, నిజామాబాద్ చుట్టు ప్రక్కల గ్రామాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు వస్తున్నారు. పిడిగుద్దులాటలో తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని.. ఇది కేవలం ఆచారం, ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు.
కాగా పిడిగుద్దులాటలో గాయపడినవారు.. కామదహనంలోని బూడిదను తీసుకుని దెబ్బలు తగిలిన చోట రాసుకుంటే అవి త్వరగా మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..