
హైదరాబాద్‌లో లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. పువ్వు పార్టీ-పతంగి పార్టీ సై అంటే సై అంటున్నాయి. చివరి నిమిషంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగింది బీజేపీ.. గెలిచేందుకు తగినంత బలం లేకపోయినా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన బీజేపీ నేతలు.. నామినేషన్ల చివరి రోజు అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నేత గౌతమ్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కిందని.. ఈ ఎన్నికల్లో తాము ఎలా గెలుస్తామో ముందు ముందు తెలుస్తుందని గౌతమ్ రావు అన్నారు. పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
గౌతమ్‌రావు ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి
మరోవైపు గౌతమ్‌రావు ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు. అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడలేదా ? అని కామెంట్ చేశారు. అయితే గౌతమ్‌రావు అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్‌తో మాట్లాడతామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం బయటపడింది: బండి సంజయ్
మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బట్టబయలైందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. మొన్న డీలిమిటేషన్‌తో ఏకమైన ఈ రెండు పార్టీలు.. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయన్నారు. లేటెస్ట్గా మజ్లిస్‌ను గెలిపించేందుకు ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు.
ఎంఐఎం అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్
ఎంఐఎం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌గా పనిచేసిన మిర్జా.. మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక ఈ ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని ఎంఐఎం ధీమా వ్యక్తం చేసింది.
మొత్తం 112 మందికి ఓటు హక్కు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుకోవడంతో పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యే ఉండబోతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 112 మంది నేతలకు ఓటు హక్కు ఉంది. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక పార్టీలవారీగా బలాబలాలు చూస్తే కాంగ్రెస్‌కు 14, ఎంఐఎంకు 49, బీఆర్ఎస్కు 24, బీజేపీకి 25 సభ్యుల బలం ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..