
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీపతి శ్రీను అనే వ్యక్తి జీ ప్లస్-2 భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకని ఐదంస్తులు కడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపేయాలని మునిసిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ ఘోరం జరిగిందనే ఆరోపిస్తున్నారు స్థానికులు
కుప్పకూలిన భవనం భద్రాచలం పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై ఇటీవల సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం పొంచివుందని అప్రమత్తం చేశారు. అయితే ప్రశ్నించిన సామాజిక కార్యకర్తతో సదరు ఇంటి యజమాని శ్రీపతి శ్రీను ఆయన కుటుంబం దురుసుగా ప్రవర్తించారు.
ఇదిలావుంటే, ఫిర్యాదుల క్రమంలో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు మునిసిపల్ అధికారులు. కానీ భవన యజమాని శ్రీపతి శ్రీను అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కొనసాగించారు. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. G ప్లస్ 2కి పర్మిషన్ తీసుకుని ఐదంతస్తులు కడుతున్నట్లు ప్రాథమిక విచారణలోనూ చేసింది. నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువరికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది ప్రొక్లెయిన్ సహాయంతో శిథిలాలు తొలగించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తంతరలించిన పోలీసులు, గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో లోపం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి భవన యాజమాని శ్రీపతి శ్రీనుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..