
సాగు చేస్తున్న పంటను వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు ఓ కొడుకు ప్రాణాలు తీశాయి. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆ నేరం తనమీదకు ఎక్కడ వస్తుందోనని అత్యంత పాశవికంగా ఆలోచించాడు. ఏకంగా కన్న కొడుకు మృతదేహాన్ని కర్కోటకంగా పక్కనే ఉన్న నదిలో పడేశాడు. కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా.. నదిలో శవమై తేలిన కొడుకు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు నిందితుడు తండ్రే అని గుర్తించారు. ఈ ఘటన కొమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం టోంకినిలో చోటు చేసుకుంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం టోంకిని గ్రామానికి చెందిన చిరంజీవి అనే రైతు పెనుగంగా నది సమీపంలోని తన పొలానికి వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్న కుమారుడు జయేందర్(19)తో కలిసి చేనుకు వెళ్లాడు. కంచెకు తగిలి జయేందర్ మృత్యువాత పడ్డాడు. నేరం తనమీదికి వస్తుందేమోననే భయంతో… పక్క పొలానికి చెందిన చెలిరామ్ అనే వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పెన్ గంగలో పడేశాడు. గురువారం ఉదయం కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికులు శనివారం నదిలో జయేందర్ మృతదేహాన్ని గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. మృతదేహాంపై విద్యుత్తు తీగల గుర్తులు ఉండటంతో అసలు గుట్టు రట్టైంది.
పొలం పనులకు వెళ్లిన చిరంజీవి కొడుకు జయేందర్ ఆ కంచెకు తగిలి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కరెంట్ తీగలు పెట్టినట్లు పోలీసులకు తెలిస్తే.. తనమీద పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కేసులు పెడతారేమనన్న భయంతో కొడుకు జయేందర్ శవాన్ని సమీపంలోని నదిలో పడేశాడు. ఏమి తెలియనట్టు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
సీన్ కట్ చేస్తే రెండు రోజుల తరువాత జయేందర్(19) శవం.. శనివారం వార్దా నదిలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం జరిపించారు. శవ పంచనామాలో విద్యుత్ షాక్తో మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు వైద్యులు. అనుమానం వచ్చిన పోలీసులు తండ్రి చిరంజీవిని విచారించగా నేరం అంగీకరించాడు. కేసు భయంతోనే కొడుకు మృతదేహాన్ని పెనుగంగా నదిలో పడవేశానని.. తనకి సమీప పొలానికి చెందిన రైతు చెలిరామ్ సహకరించాడని ఒప్పుకున్నాడు. నిందితుడు చిరంజీవి, అతనికి సహకరించిన చెలిరామ్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి