
ఎక్కడ పాము కనిపించినా అతనికి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే అక్కడికి వెళ్లి పామును పట్టుకోవడం ఆయనకు అలవాటు. కానీ పాములు పట్టేవాడు పాము కాటుకే బలి అవుతాడని అన్నట్లుగా తాను పట్టుకోవడానికి వెళ్లిన పామే అతనిని కాటు వేయడంతో మృతి చెందాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన వంగపాటి నాగరాజు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పుడప్పుడు ఎక్కడైనా పాములు వస్తే వాటిని పట్టేవాడు. మంగళవారం సాయంత్రం కొత్తపల్లి గ్రామంలో ని అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో పాము వచ్చింది. ఆ పామును పట్టేందుకు అక్కడికి వెళ్లి పట్టే క్రమంలో చేతికి పాము కరిచింది. అక్కడే ఉన్నవారు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు.