
మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా యెల్లంపేట్ గ్రామంలో కేదార్నాథ్ , బద్రీనాథ్ ఆలయ నమూనాల నిర్మాణంపై వివాదం రాజుకుంది. ఈ నిర్మాణాలతో చార్‌థామ్ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని, కేదార్నాథ్ , బద్రీనాథ్ ప్రశస్తి దెబ్బతినే ప్రమాదముందని నిర్వాహకులకు బద్రీనాథ్ , కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు పంపించింది. వెంటనే ఆలయ నిర్మాణాలను ఆపాలని , లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్‌కు ఆదివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శంకుస్థాపన చేస్తారు. దీనిపై కేదార్నాథ్ ఆలయకమిటీ అనవసరంగా రాద్దాంతం సృష్టిస్తోందన్నారు దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ ఛైర్మన్ జైపాల్‌సింగ్ నయాల్. కేదార్నాథ్ ఆలయానికి దీనికి పోలిక లేదని స్పష్టం చేశారు.
అయితే ఈ నోటీసులపై దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ స్పందించింది. తాము కేదార్నాథ్ , బద్రీనాథ్ ఆలయాల గౌరవానికి భంగం కలిగించడం లేదని స్పష్టం చేసింది. తిరుపతి వెంకన్నకు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయని , వాటిపై తిరుమల ట్రస్ట్ ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. తమ ఆదాయం తగ్గుతుందన్న అపోహతో కేదార్నాథ్ ఆలయానికి చెందిన కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
కేదార్నాథ్ ఆలయ కమిటీకి చెందిన మీడియా ఆఫీసర్ హరీశ్ గౌర్ ఆ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆలయ కమిటీ ప్యానల్లోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ ప్రసాద్ తప్లియాల్ దానిపై సంతకం చేశారు. హిమాలయ పర్వతాల లోని బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాలను భక్తులు కొన్ని శతాబ్ధాల నుంచి విజిట్ చేస్తున్నారని, అయితే ఆ ఆలయాలకు చెందిన నమోనాలను రీక్రియేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తునట్టు కమిటీ తన నోటీసులో తెలిపింది.
రెండు వారాల్లోగా తమ నోటీసులకు స్పందించాలని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ కోరింది. ఒకవేళ స్పందన లేని పక్షంలో.. సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆలయ కమిటీ తన నోటీసులో పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.