
ఇంజనీరింగ్ చదువుతున్నాడు.. ఇక చేతికొస్తాడులే.. అనుకున్నారు తల్లిదండ్రులు.. కానీ, అతను ఆన్లైన్ గేమ్స్ కు అలవాడుపడ్డాడు.. అది కాస్త వ్యసనంగా మారింది.. డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు.. కానీ అప్పుల పాలయ్యాడు.. చివరకు అప్పులు పెరిగిపోయాయి.. ఒత్తిడి ఎక్కువైంది.. ఇక చెల్లించలేనన్న బాధ వెంటాడింది.. చివరకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో.. తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్లో చోటుచేసుకుంది.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ రావు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన నిఖిల్ రావు అప్పులు చేశాడు. గతంలో ఆన్లైన్ గేమ్స్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోతే తల్లిదండ్రులు ఆ అప్పును చెల్లించారు. ఇంకెప్పుడూ వాటి జోలికి వెళ్లొద్దని సూచనలు చేశారు.. దీంతో కొంత కాలం ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉన్నాడు.. ఆ తర్వాత మళ్లీ యథామామూలుగా మళ్లీ నిఖిల్ రావు గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు..
డబ్బులు లేకపోవడంతో అప్పులు తీసుకుని మళ్లీ ఆన్లైన్ గేమస్ ఆడటం ప్రారంభించాడు. ఇలా మళ్లీ అప్పులు పెరిగాయి.. ఇటీవల హైదరాబాద్ నుండి నిఖిల్ రావు కరీంనగర్ వచ్చాడు. తిరిగి హైదరాబాదు వెళ్తానని తండ్రితో చెప్పడంతో తండ్రి తిరుపతి రావు తన కొడుకును కరీంనగర్లో బస్ ఎక్కించాడు. కరీంనగర్ నుండి హైదరాబాద్ బస్సు ఎక్కిన నిఖిల్ రావు ఇంద్రనగర్ వద్ద బస్సు దిగి గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి.. తమ వ్యవసాయ బావిలో పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు.. స్థానికుల సహకారంతో డెడ్ బాడీని బయటకు తీశారు.. అనంతరం పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి వరకు తమతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు విగత జీవిగా కనిపించడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.. వారి రోదనలు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రి సిరికొండ తిరుపతి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..