

సంగీతానికి రాళ్లు కరుగుతాయన్న సామెత విన్నాం. రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడి రాళ్లు మాత్రం రాగాలు పలుకుతాయి. ఈ రాళ్ళు స్పర్శ తాకితే స్పందిస్తాయి. ఇక్కడున్న ఒక్కో రాయి ఒక్కో స్వరాన్ని పలికిస్తూ.. సరిగమపదని ధ్వనులతో వినసొంపైన శబ్దాలతో ఆశ్చర్యపరుస్తోంది. లయబద్ధంగా తాకితే మరింత రాగాలు పలుకుతోంది. రాగాలు పలికే రాళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా చండూరు మండలం అకినేనిగూడెం, అంగడిపేట గ్రామాల మధ్య ఓ గుట్ట ఉంది..మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంతం బండ మధ్యలో పెద్ద గుండు ఉంది. దానిని అనుకుని మరో పెద్ద రాయి కూడా ఉంది. ఆ గుండు రాయిని మరో రాయితే కొడితే కంచులా శబ్ధం వినిపిస్తోంది. ఆ రాయి నుంచి వచ్చే వివిధ రకాల సంగీత ధ్వనులు అబ్బురపరుస్తాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ధ్వని తరంగాలు మనసు పులకరింప చేస్తాయి. ఈ రాళ్లను రాపిడిచేస్తే చక్కటి వినసొంపైన ధ్వని తరంగాలు సవ్వడి చేస్తాయి. ఓ రాయి గుళ్లో గంట కొట్టినట్లు టంగ్.. టంగ్ మని ప్రతిధ్వనిస్తే మరో రాయి ఇనుప రాడ్డుతో గంట కొట్టినట్లు ధ్వనిస్తుంది. రాయి ప్రాధాన్యం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ గుట్టను స్థానికులు నగారా బండగా పిలుస్తున్నారు. రాజుల కాలంలో శత్రువుల కదలికలను గమనించి ఈ బండరాయి వద్ద శబ్దం చేస్తే.. ప్రజలు సైనికులు అప్రమత్తమయ్యే వారిని స్థానికులు చెబుతున్నారు.
అందుకే ఈ గుట్టకు నగారా బండగా పేరు వచ్చిందని చెబుతున్నారు. అరుదుగా ఉండే ఇలాంటి మ్యూజిక్ రాక్స్ ను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ బండ ప్రాంతాన్ని కొందరు కబ్జా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వింత నగర బండను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలను స్థానికులు కోరుతున్నారు.