
ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో పలుచోట్ల వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మ బస్తీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. దాంతో.. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌కూల్‌గా మారింది. మంచిర్యాల జిల్లా్లోని పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పోతన్‌శెట్టిపల్లి చౌరస్తాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలివాన బీభత్సానికి రెండు దాబాల పైకప్పులు ఎగిరిపోయాయి. దాంతో.. ఓ కారు ధ్వంసం కాగా.. పలు ద్విచక్ర వాహనాలు గాలికి కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో గాలివాన దుమారంతో భారీ నష్టం వాటిల్లింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నిట్టూరు గ్రామంలో రాళ్లతో వర్షం పడింది. అటు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చేల్లాపూర్, రాజక్కపేట గ్రామాల్లో ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. భారీ వర్షం కురవడంతో ఆయా గ్రామాలు తడిసిముద్దయ్యాయి. మొత్తంగా.. కొద్దిరోజులుగా భానుడి ప్రతాపం చూపుతున్న వేళ.. ఉరుములు, మెరుపుల భారీ వర్షంతో పలు జిల్లాలు కూల్‌కూల్‌గా మారిపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.