Team India : న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో భారత జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఇప్పుడు రాబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్‌కు సైడ్ స్ట్రెయిన్(పక్కటెముకల కండరాల గాయం) అయ్యింది. ఆ మ్యాచ్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన సుందర్, తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను పరిగెత్తడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తాజాగా వచ్చిన స్కానింగ్ రిపోర్టుల ప్రకారం, ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనవరి 21 నుండి నాగ్‌పూర్‌లో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో కూడా అతను ఆడలేడని తేలిపోయింది.
రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో సుందర్ దూరమవ్వడం జట్టు బ్యాలెన్సింగును దెబ్బతీస్తుంది. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, లోయర్ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకునే సుందర్ లేకపోవడం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పెద్ద తలనెొప్పిగా మారింది. మొదటి వన్డేలో సుందర్ 27 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఆ తర్వాత అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. బ్యాటింగ్‌లో సుందర్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, కనీసం సింగిల్ తీయడానికి కూడా నొప్పితో విలవిలలాడటం అందరినీ కలవరపెట్టింది.
కేవలం వాషింగ్టన్ సుందర్ మాత్రమే కాదు. టీమిండియాలో కీలక ఆటగాళ్లంతా గాయాల పాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా సైడ్ స్ట్రెయిన్ కారణంగా వన్డే సిరీస్ నుండి తప్పుకున్నాడు. మరోవైపు యువ సంచలనం తిలక్ వర్మకు గజ్జల్లో గాయం కావడంతో సర్జరీ జరిగింది. దీనివల్ల అతను మొదటి మూడు టీ20లకు అందుబాటులో ఉండడు. ఇలా ఒక్కొక్కరుగా స్టార్ ప్లేయర్లు దూరమవుతుండటంతో న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టును టీమిండియా ఎలా ఎదుర్కోబోతుందో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐ త్వరలోనే సుందర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
