T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 కోసం షెడ్యూల్ సిద్ధమైనప్పటికీ, బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌ల వేదికల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఆడటం తమకు క్షేమం కాదని బంగ్లాదేశ్ బోర్డు భావిస్తోంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు లేదా మరో తటస్థ వేదికకు మార్చాలని వారు ఐసీసీని కోరుతున్నారు. ఈ పరిణామాలపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పందిస్తూ.. మ్యాచ్‌ల మార్పు గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, అసలు ఈ విషయంలో బోర్డును చీకట్లో ఉంచారని అసహనం వ్యక్తం చేశారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. దీనికి తోడు ఐపీఎల్ 2026 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయడం కూడా ఈ వివాదానికి ఒక కారణమైందని చర్చ జరుగుతోంది. భద్రతా కారణాల వంకతో భారత్‌కు రాకుండా తప్పించుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన బీసీబీ ప్రతినిధులు, భారత్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లు ఇష్టపడటం లేదని తేల్చి చెప్పారు.
ఐసీసీ రిపోర్ట్ ఏం చెబుతోంది?
బంగ్లాదేశ్ భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఐసీసీ స్వతంత్ర భద్రతా సంస్థల ద్వారా వేదికలను పరిశీలించింది. కోల్‌కతా, ముంబై వంటి నగరాలు బంగ్లాదేశ్ జట్టుకు సురక్షితమేనని, అక్కడ ప్రమాదం తక్కువ నుంచి మధ్యస్థం మాత్రమేనని రిపోర్ట్ పేర్కొంది. సాధారణ భద్రతా ఏర్పాట్లు ఉంటే సరిపోతుందని, మ్యాచ్‌లను మార్చాల్సిన అవసరం లేదని ఐసీసీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు.
షెడ్యూల్ ప్రకారం కోల్‌కతాలో తొలి పోరు
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 7, 2026న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లతో జరిగే మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగాల్సి ఉన్నాయి. బంగ్లాదేశ్ మొండితనం చూస్తుంటే ఈ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐసీసీ ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందోనని క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
