
సూర్యాపేటలోని మామిల్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి హత్యకు హత్యకు గురయ్యాడు. పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాలవ కట్టపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లల మర్రికి చెందిన నవీన్, కృష్ణ స్నేహితులు. తరచూ పిల్లలమర్రిలోని నవీన్ ఇంటికి వస్తూ పోతున్న కృష్ణ నవీన్ సోదరి భార్గవిని ప్రేమించాడు. వీరి ప్రేమను భార్గవి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆరు నెలల క్రితం భార్గవిని కృష్ణ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్గవి, కృష్ణ ఇద్దరూ సూర్యాపేటలో కాపురం పెట్టాడు. ప్రేమ పెళ్లిని నిరాకరించిన భార్గవి తల్లిదండ్రులు వారిని విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కులాంతర వివాహం చేసుకున్న బంటిపై భార్గవి సోదరుడు నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మహేష్ అనే మిత్రుడి నుంచి ఫోన్ కాల్ అందుకున్న కృష్ణ భార్యకు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లాడు. రాత్రి లేట్ అయినా కృష్ణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్ నుండి పిల్లల మర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహం పడి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కృష్ణ బంధువులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లు గుర్తులు కన్పిస్తున్నాయి. మృతుడి ఒంటిపై కమిలిన గాయాలున్నాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలిస్తున్నారు. భార్గవి సోదరుడు కోట్ల నవీన్ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కృష్ణ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమా, లేక పాత కక్షలే కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..