Suryakumar Yadav : ఆసియా కప్‌లో భారత జట్టు టైటిల్ గెలవడంతో పాటు, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లు, పోస్ట్-మ్యాచ్ ట్రోఫీ వేడుకల విషయంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా, ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీసింది. అయితే, ఈ ఒత్తిడితో కూడిన పరిస్థితులను సూర్యకుమార్ ఎలా ఎదుర్కొన్నాడు? తన కెప్టెన్సీలో ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడు? అనే విషయాలపై తాజాగా ఆయన స్పందించాడు. ముఖ్యంగా, రోహిత్ శర్మ సతీమణి రితిక సజ్దేవ్ ఇచ్చిన ఒక సలహా తనకు చాలా సహాయపడిందని సూర్యకుమార్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ మైదానంలోనూ, మైదానం వెలుపలా వివాదాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. టాస్ సమయంలో కూడా సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయలేదు. అయితే, అత్యంత పెద్ద వివాదం ఫైనల్ తర్వాతే చోటు చేసుకుంది. ఏసీసీ చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బాస్, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. ఈ నిర్ణయం మైదానంలోనే తీసుకున్నామని, ఇందులో బీసీసీఐ పాత్ర లేదని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన ఆసియా కప్‌కు ఒక వివాదాస్పద ముగింపును ఇచ్చింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ ఒత్తిడిని ఎలా తగ్గించుకున్నాడో వివరించాడు. “చాలా గందరగోళం ఉంటుందని నాకు తెలుసు. వాట్సాప్‌ను పట్టించుకోలేం ఎందుకంటే అది కమ్యూనికేషన్ పద్ధతి. కానీ ఇక్కడికి రాకముందు, నా ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి అన్ని సోషల్ మీడియా యాప్‌లను తొలగించాను. ఎందుకంటే అవి ఫోన్లో ఉంటే, ప్రజలు మెసేజులు పంపుతారు, వాటిని చూడటం మానవ సహజం” అని సూర్యకుమార్ చెప్పారు.
పెద్ద మ్యాచ్‌లకు ముందు రోహిత్, అతని భార్య (రితిక) ఎలా ఒత్తిడిని తగ్గించుకుంటారు అని నేను వారితో మాట్లాడాను. రోహిత్ తన ఫోన్లో అన్ని సోషల్ మీడియా యాప్‌లను క్లోజ్ చేస్తాడని రితిక నాకు చెప్పింది. నేను కూడా అదే పద్ధతిని పాటించాను, అది నా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడింది” అని సూర్యకుమార్ వివరించారు. ఇది రోహిత్ కెప్టెన్సీ స్టైల్ నుంచి తీసుకున్న ఒక ముఖ్యమైన పాఠం.
ఆసియా కప్‌లో తన బ్యాటింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేనప్పటికీ, తాను ఫామ్ కోల్పోలేదని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. “నాకు చిన్నపాటి స్టార్ట్ వస్తుంది, ఆ తర్వాత బండి ఆగింది. నేను షాట్లు ఆడటం లేదని కాదు, షాట్లు కూడా ఆడుతున్నాను. నేను ఏమీ ఆపలేదు. నేను ఫామ్ కోల్పోయానని చెప్పలేను. కేవలం రన్స్ చేయలేకపోతున్నాను అని మాత్రమే చెప్పగలను” అని వివరించారు.
కెప్టెన్సీ ఒత్తిడిపై మాట్లాడుతూ.. “కెప్టెన్సీ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు. రోహిత్ భాయ్‌ను చూస్తే, అతను కెప్టెన్సీలో మరింత ఓపెన్‌గా బ్యాటింగ్ చేశాడు. ఇది కేవలం చిన్న అడ్డంకి మాత్రమే, నేను దాన్ని దాటుతాను. దేవుడు అన్నింటినీ సరైన సమయం కోసం దాచి ఉంచాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు అతని మానసిక ధైర్యం, కెప్టెన్సీ నైపుణ్యాలు, భవిష్యత్ విజయాలపై అతని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
