
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఏప్రిల్ 20వ తేదీలోగా నిరంతరం సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) మార్కులను ఎంట్రీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. విద్యా సంవత్సరం ముగింపునకు చేరుకోవడంతో ఏప్రిల్ 20లోపు ఎంట్రీ చేసి 21న ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను డౌన్లోడ్ చేసి పరిశీలించాలని పేర్కొంది. ఏప్రిల్ 23న జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో విద్యార్థులకు అందజేయాలని సూచించింది. అనంరతం ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది కూడా.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. తిరిగి జూన్ 12, 2025వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అంటే మొత్తం 46 రోజులపాటు విద్యార్ధులకు వేసవి సెలవులు వచ్చాయన్నమాట. అటు ఏపీలోనూ ఏప్రిల్ 23వ తేదీతో అకడమిక్ ఇయర్ పూర్తి కానుంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణ లాసెట్ 2025 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ విద్య కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేవాలకు నిర్వహించే లాసెట్ 2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అయితే ఈ గడువును తాజాగా పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి ప్రకటన జారీ చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.