
నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచంలో దాదాపు 7.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో కూడా ఈ సంఖ్య 1.75 లక్షలు దాటింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల వయస్సు పిల్లలు, యుక్త వయస్సు వారిలో ఆత్మహత్య ఆలోచనలను మనం ఎలా గుర్తించగలం? పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు కనిపిస్తే వారిని ఎలా బయటకు తీసుకురావాలి? చైల్డ్‌లైన్ డైరెక్టర్ షాన్ ఫ్రియెల్ ఏమంటున్నారంటే..
ముఖ్యంగా పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా లేరని చెప్పడానికి వారి ప్రవర్తలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చదువులు, పాఠశాల కార్యకలాపాలపై ఆసక్తి లేకపోవడం.. రోజులు గడిచేకొద్దీ పాఠశాల కార్యకలాపాలపై పేలవమైన పనితీరు కనబరచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, స్నేహితులను కలవడం మానేయడం, ఆనందించే పనులు చేయడం మానేయడం, రాత్రిపూట తక్కువ నిద్రపోవడం లేదా ఉదయం ఎక్కువ నిద్రపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం, విచారం, నిరాశ లేదా విసుగు అనుభూతుల గురించి ఎక్కువగా మాట్లాడటం, మాదకద్రవ్యాల వాడకం లేదా మద్యపానం వంటి ప్రమాదకర అలవాట్లు కనిపించడం, అధిక ఆకలి లేదా తక్కువ ఆకలిగా ఉండటం, స్నానం చేయడం, తినడం నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం వంటివి కూడా ప్రమాదకరమే.
సిగ్గు లేదా అపరాధ భావనలు కూడా తరచుగా పిల్లల్ని వెంటాడతాయి. కుటుంబానికి లేదా స్నేహితులకు భారంగా అనిపించడం, జీవితాన్ని కోల్పోవడం గురించి అధికంగా మాట్లాడటం, ఉన్నట్లుండడి అకస్మాత్తుగా మౌనంగా మారడం, ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడటం, ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే విషయాలను గూగుల్‌లో వెదకడం, నేను చనిపోవడం మేలు, నాకు బతకాలని లేదు, నేను లేకుంటే ఎవరూ నన్ను మిస్ అవ్వరు లాంటి మాటలు పదే పదే పిల్లలు చెబుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే మానసిక నిపుణుల వద్దు తీసుకెళ్లి తగిన చికిత్స చేయడం మంచిది.