
భోపాల్, జనవరి 27: మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాలు జనవరి 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 394 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 24 మంది, డీఎస్పీ పోస్టులకు 19 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో దీపికా పాటిదార్ ఓవరాల్ టాపర్‌గా నిలిచింది. ఇక భోపాల్‌కు చెందిన రంషా అన్సారీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డీఎస్పీ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచారు. అసలు ఎవరీ రంషా అన్సారీ, ఆమె ఎలా ప్రిపేర్ అయ్యింది? MP PSC పరీక్ష కోసం ఆమె రోజుకు ఎన్ని గంటలు చదివేది వంటి విషయాలు మీ కోసం..
ఎంపీ పీసీఎస్ 2022 పరీక్షలో రంషా మొత్తం 880.50 మార్కులు సాధించింది. మెయిన్ పరీక్షలో 760.50 మార్కులు, ఇంటర్వ్యూలో 120 మార్కులు వచ్చాయి. దీంతో రంషా డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. రంషాకి ఎంపీ పీసీఎస్ పరీక్ష ఇప్పటికే రెండు సార్లు రాసినా విజయం వరించలేదు. తన మూడో ప్రయత్నం ఫలితంచడంతో ఈసారి విజయం సాధించింది. శారీరకంగా, మానసికంగా సవాళ్లకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని, ఇదే తన విజయ మంత్రమని రంషా చెబుతోంది.
రాంషా.. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం సన్నద్ధం కావడం ప్రారంభించిన రాంషా.. రోజుకు 11-12 గంటలు చదువుకే కేటాయించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చివరకు తన కష్టానికి తగిన ఫలం లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన కుటుంబం సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైందని వెల్లడించింది. తన కుంటుంబం అన్ని వేళలా తనకు మద్దతుగా నిలిచారని, ముందుకు సాగడానికి తనను ప్రేరేపించారని రంషా తెల్పింది. రాంషా తండ్రి మహ్మద్ అన్సారీ వ్యవసాయ శాఖలో యూడీసీగా పనిచేస్తున్నారు. తల్లి సంజీదా అన్సారీ గృహిణి.
ఇవి కూడా చదవండి
ఎంపీ పీసీఎస్ 2022 పరీక్షలో మొత్తం ఎంత మంది అమ్మాయిలు DSP పోస్టులకు సెలక్ట్ అయ్యారంటే?
డీఎస్పీ పోస్టుకు ఎంపికైన మొత్తం 19 మందిలో 8 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. రంషా అన్సారీతో పాటు నేహా అగర్వాల్, స్నేహ బాబెలే, అన్షికా వైద్య, దీపికా పటేల్, రష్మీ అహిర్వార్, రంజనా మాండ్లోయ్, రాను మోజ్లే MP PCS 2022 పరీక్షలో విజయం సాధించి DSP పోస్టులకు సెలక్ట్ అయ్యారు. అయితే మరో 15 మంది అభ్యర్థులను కూడా డీఎస్పీ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. ఇందులోనూ 8 మంది అమ్మాయిలు ఉండటం విశేషం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.