
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో రాహువు అనుకూలంగా ఉన్నవారు జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. అనుకున్నవి నెరవేర్చుకోగలుగుతారు. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు మే 18 నుంచి కుంభ రాశిలో సంచారం ప్రారంభించి ఏడాదిన్నర పాటు అక్కడే ఉంటాడు. ఈ ఏడాదిన్నర కాలంలో మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆ రాశులవారు తమ లక్ష్యాలను సాధించుకునే అవకాశం ఉంది. రాహువు పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మారాలన్న పక్షంలో ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
- మేషం: ఈ రాశివారికి శనీశ్వరుడు మీన రాశిలో ప్రవేశించడం వల్ల ఏలిన్నాటి శని ప్రారంభం కాబోతోంది. అయితే, లాభ స్థానంలో రాహువు ప్రవేశించినప్పటి నుంచి ఈ ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రతి పనిలోనూ విజయాలు కలుగుతాయి.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లో పనిచేసే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పేరు ప్రఖ్యాతులు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక ఆదాయం విషయంలో కూడా అనుకున్నవి సాధిస్తారు.
- మిథునం: ఈ రాశికి రాహువు భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల నిరుద్యోగులు విదేశాల్లో లేదా విదేశీ సంస్థలో ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. సంపన్నులు కావాలన్న ఈ రాశివారి కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వైద్య ఖర్చులు తగ్గుతాయి.
- కన్య: ఈ రాశికి రాహువు ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని ముఖ్యమైన వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు.
- ధనుస్సు: ఈ రాశివారికి మార్చి 30 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అయితే, మే 18న రాహువు తృతీయ స్థానంలో ప్రవేశించడంతో ఈ అర్ధాష్టమ శని తాలూకు కష్టనష్టాలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు, ప్రయత్నాలు, లక్ష్యాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆశించిన విధంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. ఆస్తిపాస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో రాహువు ప్రవేశించిన దగ్గర నుంచి ఆదాయం మరింత వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు సఫలమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది.