
చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక మన ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. తిండి తిప్పలుమాని ఫోన్‌కే అతుక్కుపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలా స్మార్ట్‌ఫోన్‌కు అడిక్టవడంతో రకరకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వరుసగా మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అసాధ్యంగా అనిపించినప్పటికీ, ఇటీవలి సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనాయి. స్మార్ట్‌ఫోన్‌ను వరుసగా మూడు రోజులు ఉపయోగించకపోతే, మెదడులోని ప్రతి కణం అద్భుతమైన వేగంతో పనిచేస్తుందట. కంప్యూటర్ను రీస్టార్ట్ చేసినప్పుడు మునుపటి కంటే మెరుగ్గా పనిచేసినట్లే, మెదడు మూడు రోజుల్లో తనంతట తానుగా రీబూట్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
నేటి స్మార్ట్ఫోన్లపై ఆధారపడిన జీవనశైలి కారణంగా మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. కనీసం నిద్ర సమయంలోనైనా చాలా మంది ఫోన్లను దూరంగా ఉంచాలని అనుకున్నా, ఎక్కువసేపు వాటిని దూరంగా ఉంచలేని పరిస్థితికి దిగజారిపోతున్నారు. ఎందుకంటే ధూమపాన వ్యసనం లాగే, స్మార్ట్‌ఫోన్ వ్యసనం కూడా ఒక రకమైన వ్యసనంగా మారిపోతుంది. కానీ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఫోన్‌కు మూడు రోజులు దూరంగా ఉంటే, మెదడు స్వయంగా రీబూట్ అవుతుందని తేలింది. అంతేకాకుండా ఫోన్‌పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
మానవ మెదడుపై కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల ప్రభావాలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక స్మార్ట్‌ఫోన్ వ్యసనం మెదడు సాధారణ పెరుగుదల, అంతర్గత రసాయన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి అత్యవసర కారణాలకు తప్ప మిగతా ఎవరికీ 72 గంటల పాటు స్మార్ట్ఫోన్లను ఉపయోగించడానికి అనుమతించబడలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, అత్యవసర పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు కాల్స్ తప్ప వారందరికీ ఫోన్లు దూరంగా ఉంచారు. జైలులో ఖైదీల మాదిరిగానే కఠినంగా ఈ రూల్ అమలు చేశారు. స్మార్ట్ఫోన్లను ఉపయోగించడానికి అనుమతించకపోతే వినియోగదారులు ప్రవర్తించే విధానం, ధూమపానం, మద్యం సేవించడానికి అనుమతించనప్పుడు ప్రవర్తించే విధానానికి చాలా పోలి ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.
ఇవి కూడా చదవండి
18-30 సంవత్సరాల వయస్సు గల 25 మంది వ్యక్తులు 72 గంటల పాటు తమ ఫోన్లను ఉపయోగించకుండా నిషేధించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మందికి గేమింగ్ అలవాటు ఉంది. వీరి ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, భావోద్వేగాలను నియంత్రించే మెదడు రసాయనాలు డోపమైన్ లేదా సెరోటోనిన్ స్రావంలో తేడాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అనవసరంగా ఆందోళన చెందడం, కొంతమందికి అధికంగా ఆకలిగా ఉండటం, మరికొందరు పూర్తిగా సైలెంట్ అయిపోవడం వంటి లక్షణాలు మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వ్యసనం కారణంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఫోన్‌ను ఉపయోగించని మూడు రోజుల తర్వాత, మెదడు మళ్ళీ దానంతట అదే సాధారణంగా పనిచేయగలుగుతుండటం, మెదడు తనను తాను రీబూట్ చేసుకోవడం గమనించినట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వివరించారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.