
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం (SLBC) ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. SLBC టన్నెల్లో రెస్క్యూ సిబ్బంది ఎఫర్ట్స్ ఫలిస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాల మధ్య ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. మిగతా కార్మికులు లోకో ట్రాక్ సమీపంలోనే చిక్కుకుపోయారా? వారి కోసం వేట కొనసాగుతోంది. ఆ.. ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ బృందాలు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి కనిపించింది. నాన్‌స్టాప్‌గా 32వ రోజు సహాయక చర్యలు కొనసాగిస్తున్న వేళ.. కన్వేయర్ బెల్ట్‌కి 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాం ఆనవాళ్లు కనిపించాయి. దుర్వాసన వస్తుండటంతో స్ప్రే బాటిల్స్ లోపలికి తీసుకెళ్లారు. టీబీఎం మెషిన్ పరికరాలు గ్యాస్ కట్టర్‌తో తొలగించారు. మృతదేహాం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి బురద తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గత నెల ఫిబ్రవరి 22న SLBC టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారి ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన వేర్వేరు విభాగాల రెస్క్యూ సిబ్బంది డే అండ్ నైట్ షిప్ట్‌ల వారీగా అన్వేషిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమిస్తూ కార్మికుల జాడ కోసం శ్రమిస్తున్నాయి. 8మందిలో 16వ రోజు గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటకు తీశారు. అ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతుండగా మరో మృతదేహం కనిపించింది. అది ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదిలావుంటే, రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉందని.. కూలిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే కార్మికులను బయటకు తీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం సూచించారు. మరోవైపు డీ1, డీ2 ప్రాంతాల్లో కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. ఆ ప్రాంతంలోనే కార్మికులు చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..