
మనమంతా సక్సెస్ అంటే ఓ నిర్దిష్టమైన భావాలను కలిగి ఉంటాం. కానీ, ఈ పుస్తక రచయిత జేమ్స్ మాత్రం మీ అలవాట్లే మీ విజయాలను సూచిస్తాయంటాడు. మీరు ఈరోజు ఒక మంచి అలవాటును చేసుకుంటే దాన్ని మీరు అమలు చేయగలిగితే కచ్చితంగా అది మిమ్మల్ని విజయతీరాలకు చేర్చగలదని చెప్తాడు. అయితే మన ఒకటి మొదలు పెట్టి దానికి కట్టుబడి ఉండటమే అన్నిటికన్నా పెద్ద టాస్క్. మరి ఈ బలహీనతలను అధిగమించడం ఎలాగో కూడా రచయిత వివరిస్తున్నాడు.
వంద పర్సెంట్ అక్కర్లేదు ఒక శాతం చాలు…
మీరేదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు లేదా కొత్త అలవాట్లను చేసుకుంటున్నప్పుడు అందులో ఒక్క సారిగా వంద శాతం మార్పును ఆశించడం మానుకోండి. ఇది మీ సామర్థ్యాలను తక్కువ చేసుకోవడమే. దానికి బదులుగా నిన్నటికన్నా మీ పనితీరు లేదా మీ అలవాట్లు ఒక్క శాతం మెరుగైనా అది వంద రెట్ల ఫలితాన్ని ఇవ్వగలదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నిన్నటికన్నా మెరుగ్గా ఉండటమే లక్ష్యాన్ని చేరుకోవడంలో అసలైన మైలు రాయి అంటాడీ రచయిత.
నీ అలవాట్లే నువ్వు..
మీరు రోజూ ఏవైతే అలవాట్లను చేసుకుంటారో కొన్ని రోజులకు మీ గుర్తింపు వాటి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పుస్తక రచయిత చెప్పే మాటల్లో ఒకటి.. మీ అలవాట్లే మీ సక్సెస్ ను నిర్ణయిస్తాయని అంటాడు. నువ్వు సిగరెట్ తాగడం నేర్చుకుంటే కొన్ని రోజులకు స్మోకర్ అవుతావు. అదే జిమ్ కి వెళ్లడం నేర్చుకుంటే ఫిట్ గా మారతావు. అందుకే రోజుకో కొత్త అలవాటు నేర్చుకుంటే మీ జీవితం దానికదే బెటర్ గా మారుతుంది.
బాడీని మైండ్ ని ఇలా సెట్ చేయండి..
అటామిక్ హాబిట్స్ పుస్తకంలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హాబిట్ లూప్ అనే కాన్సెప్ట్. అంటే మనం జీవితంలో విజయం సాధించడానికి మనలో ఉండే తపనే అంటాడు. దేన్నైనా మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే దాని ద్వారా అందే ఫలాలు కూడా మనవే అంటాడు. అంటే మనకు పనికొచ్చే అలవాటును పట్టుకుని దాని నుంచి మనకు కావలసిన ఫలితం అందేదాకా వదలకపోవడం. ఇందుకు మీ మైండ్ ని బాడీని రెడీ చేసుకోవలసి ఉంటుంది.
అన్నింటికన్నా మంచి ముహూర్తం ఈ క్షణమే..
ఈ బుక్ నుంచి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన మరో విషయమిది. మీరు ఏదైనా మంచి విషయాన్ని మొదలు పెట్టాలంటే దానికి మీనమేషాలు లెక్కించకూడదు. మీ బుర్రలో ఆ ఆలోచన మెదిలిన క్షణమే ఆ పనికి ఓ గొప్ప ముహూర్తంగా భావించాలి. ఆ పనిని వదిలేయాలన్నా మొదలు పెట్టాలన్నా ఆ క్షణమే చేసేయండి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషం అన్నారు కదా..
మీ భుజం మీరే తట్టుకోండి..
ఏదైనా ఒక మంచి అలవాటుకు స్టిక్ అయ్యి ఉండాలంటే ముందుగా అందులో మీరు సాధించిన చిన్నపాటి అంశాలనైనా సరే ముందు గుర్తించండి. అది సాధించగలిగినందుకు ప్రశంసించుకోండి. మీ భుజాన్ని మీరే తట్టుకోండి. ఆ పనిలో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన మోటివేషన్ మీకు లభిస్తుంది.
సక్సెస్ ను ట్రాక్ చేస్తున్నారా..
కఠినమైన రోజుల్లో అందరిలాగే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. అలాంటప్పుడు ఇక ఆ పనిని కొనసాగించేందుకు అవసరమైన మోటివేషన్ లభించదు. అందుకే సక్సెస్ ను ట్రాక్ చేయడం చాలా అవసరం. ఇప్పటివరకు మీరేం సాధించారో ఓ లెక్క వేసుకోండి. ఇంకా సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది. మీరు అప్పటికే అచీవ్ చేసిన వాటి నుంచి మీకు ధైర్యం లభిస్తుంది. కఠినమైన సమయాల్లో ఈ టెక్నిక్ పనిచేస్తుంది.
పట్టుకుని ఉండటం నేర్చుకోండి..
మీరేది మొదలు పెట్టినా దాన్ని పట్టుకుని చివరిదాకా ఉండటం నేర్చుకోండి. ఉదాహరణకు అదే జిమ్ చేయడమే అనుకోండి. ఈరోజు మొదలుపెట్టి రేపటికల్లా దాన్ని అటకెక్కించడం వద్దు. అలవాటును మానకుండా ఉన్నప్పుడే దాని నుంచి వచ్చే పాజిటివ్ రిజల్ట్ ను మనం చూడగలం.
రెండు రోజుల నియమం పెట్టుకోండి..
ఏ పనిలో అయినా ఎత్తు పల్లాలు సహజం. కానీ రెండు రోజులకన్నా మీరు చేయాలనుకున్న పనిని వాయిదా వేస్తే ఇక దాన్ని తిరిగి సాధించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. అందుకే రెండు రోజులకు మించి ఏ మంచి అలవాటును మానకండి. ఇది మీ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసి ఆ పనిని పూర్తి చేయనీయకుండా అడ్డుకుంటుంది.