రిపబ్లిక్ డే సందర్భంగా 2025గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. మొత్తం 139 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 139 మందిలో 23 మంది మహిళలు, 10మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈసారి ఏడుగురు తెలుగువారికి పద్మ అవార్డులు వరించాయి. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. అలాగే కళల రంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. విద్య సాహిత్యంలో కేఎల్ కృష్ణకు, కళల విభాగంలో మాడుగుల నాగఫణిశర్మకు, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్ర చార్య, మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఇటు తమిళ నటుడు అజిత్, ప్రముఖ నటి శోభన పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్‌ను పద్మశ్రీ వరించింది.
పలువురు విదేశీయులను పద్మ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగ్‌ను పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. గోవాకు చెందిన వంద ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు లిబియా లోబో సర్దేశాయ్‌కి పద్మశ్రీ అవార్డు లభించింది.
పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ నుంచి గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ , గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. వివిధ రంగాలలో వారు గణనీయమైన కృషి చేసినప్పటికీ గుర్తించలేదని.. 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు… ప్రకటించిన 139 అవార్డుల్లో కనీసం 5 అవార్డులు కూడా ఇవ్వలేదంటూ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం.
ఇదిలాఉంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి, అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మొత్తంగా.. పద్మ అవార్డుల గ్రహీతలను దేశవ్యాప్తంగా ప్రశంసలతో ముంచెత్తున్నారు. పలుచోట్ల కేంద్రం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
