
ఇటీవలె బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యా రావు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యా రావు అరెస్టు అయింది. దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారంతో ఈ నెల 3న బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో పట్టుబడింది. అయితే చాలా కాలంగా ఇలా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న రన్యా రావు వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఆమె పెళ్లి వీడియోపై ఫోకస్ పెట్టింది.
రన్యా రావును జితిన్ హుక్కేరి అనే ఆర్కిటెక్ట్‌ను నాలుగు నెలల క్రితం తాజ్ వెస్ట్ ఎండ్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఎవరెవరు వచ్చారు? ఎవరు ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పెళ్లి జరిగిన హోటల్‌కు వెళ్లి అతిథుల లిస్ట్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు రన్యా రావు బెయిల్ పిటీషన్ కూడా కోర్టులో విచారణ సాగుతోంది. బెయిల్‌పై అభ్యంతరాలను సమర్పించాలని కోర్టు డీఆర్ఐ అధికారులను ఆదేశించింది. అయితే రన్యా రావు వెనుక ఓ మంత్రి ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.
ఈ విషయంపై ఏకంగా కర్ణాటక అసెంబ్లీలో కూడా రచ్చ జరిగింది. విపక్ష బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే బెంగళూరు ఎయిర్ పోర్టులో రన్యా రావు ప్రోటోకాల్ ఉల్లంఘించడంలో ఐపీఎల్ రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్‌లో ఆ ఐపీఎస్ పాత్ర ఏంటనే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, ఐపీఎస్ రామచంద్ర రావు, రన్యా రావుకు సవితి తండ్రి అవుతారు. దీంతో ఐపీఎల్ రామచంద్రరావు పేరును రన్యా రావు ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ ఉల్లంఘన కోసం వాడుకున్నట్లు కూడా అనుమానాలు వస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.