
రాజమండ్రి, జనవరి 23: ప్రయాణికులతో నిండుగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై సాఫీగా వెళ్తుంది. బస్సులోని వారంతా నిశ్చింతగా గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ కుదుపు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు బస్సు రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరంలో బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులంతా చింతవందరగా పడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తెల్లవారు జామున ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి దివాన్ చెరువు హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో కోమలి 21 సంవత్సరాలు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు బస్సులోని ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 28 మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న రాజానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు గామాన్ బ్రిడ్జ్ హైవేపై కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడి.. రోడ్డుపై ఫిల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడకక్కడే మహిళ మృతి చెందగా.. మరో మహిళకు కాలు తెగిపోయింది. క్షతగాత్రులందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంత ప్రమాదం జరిగినా 50 మందికి పైగా ప్రయాణికులు, చిన్నారులు ప్రాణాలతో బయటపడటం విశేషం. రోడ్డుపై బస్సు అడ్డదిడ్డంగా పడిపోవడంతో.. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిలో 26 మందిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా ఇందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా బస్సు బోల్తాపడిన విషయం పోలీసులకు ఆలస్యం తెలియడంతో పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రులు దాదాపు గంటపాటు రోడ్డుపై విలవిల్లాడి పోయారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.