

అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం (ఏప్రిల్ 16) కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కురిసిన వర్షాలు కురిశాయి. రాత్రి 8 గంటల వరకు అనకాపల్లి జిల్లా చీడికాడలో 425, తిరుపతి జిల్లా పూలతోటలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గురువారం (ఏప్రిల్ 17) కూడా చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్గాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఓవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కర్నూలులో 40.7, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్య సాయి జిల్లా కనగానపల్లిలో 40.4 డిగ్రీల మేర పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనాయి.
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు..
తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ వద్ద కేంద్రీకృతమైన ఉపరితల చక్రవాతపు ఆవర్తనం నుంచి మరాత్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ద్రోణి కొనసాగుతుంది. దీంతో ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం (ఏప్రిల్ 17) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 41.9, కనిష్టంగా భద్రాచలం లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోనూ ఓ వైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ , ఖమ్మం, భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎక్కడెక్కడ ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదైనాయంటే..
- నిజామాబాద్.. 42.4 డిగ్రీలు
- మెదక్.. 41.8 డిగ్రీలు
- ఆదిలాబాద్.. 41.6 డిగ్రీలు
- రామగుండం.. 39.2 డిగ్రీలు
- మహబూబ్ నగర్.. 38.9 డిగ్రీలు
- ఖమ్మం.. 38.6 డిగ్రీలు
- భద్రాచలం.. 38 డిగ్రీలు
- నల్లగొండ.. 37.5 డిగ్రీలు
- హైదరాబాద్.. 37.4 డిగ్రీలు
- హనుమకొండ.. 37 డిగ్రీలు
అత్యధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ రోజు (ఏప్రిల్ 17) ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 8 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.