
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించింది.. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. విచిత్రమైన వాతావరణ అంచనాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శుక్రవారం (04-04-25) అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం (05-04-25) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు, మూడుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ,ఎర్రగొండపాలెంలో 62 మిమీ, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 57.7మిమీ, నంద్యాల జిల్లా పెరుసోమల 43.2మిమీ, కృష్ణా జిల్లా ఆత్కూరులో 39మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కోన్నారు. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైందన్నారు.
మరోవైపు గురువారం వైఎస్సార్(D) కమలాపురంలో 39.9°C, నంద్యాల(D) ఆళ్లగడ్డలో 39.8°C, అనకాపల్లి(D) వడ్డాదిలో 39.6°C, ఎన్టీఆర్ (D) చందర్లపాడులో 39.6°C, పల్నాడు(D) రవిపాడులో 39.5°C, ఏలూరు (D) రాజుపోతేపల్లిలో 39.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..