
Port Explosion: దక్షిణ ఇరాన్ నగరమైన బందర్ అబ్బాస్‌లోని షాహిద్ రాజయీ ఓడరేవులో శనివారం పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు 115 మంది గాయపడ్డారని ఇక్కడి మీడియా నివేదించింది. ఒమన్‌లో ఇరాన్ అమెరికాతో మూడవ రౌండ్ అణు చర్చలు ప్రారంభించిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదానికి కారణం ఏంటి?
అయితే ఈ పేలుడుకు సంబంధించి సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ షాహిద్ రాజీ పోర్ట్ వార్ఫ్ ప్రాంతంలో నిల్వ ఉంచిన అనేక కంటైనర్లు పేలడమే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ పేలుడులో గాయపడిన వారిని వైద్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి స్థానిక నిర్వహణ అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.
పోర్ట్ కార్యకలాపాలు నిలిపివేత:
మంటలను ఆర్పడానికి పోర్టు కార్యకలాపాలను నిలిపివేసినట్లు సెమీ-అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అలాగే పెద్ద సంఖ్యలో పోర్టు ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఘటనలో చాలా మంది గాయపడి ఉండవచ్చని, మరణాలు కూడా సంభవించి ఉండవచ్చని తెలిపింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో గృహాల కిటికీలు సైతం పగిలిపోయాయని, పేలుడుకు సంబంధించిన అనేక దృశ్యాలు ఆన్లైన్లో షేర్ అయ్యాయని ఇరాన్ మీడియా తెలిపింది.
2020లో అదే పోర్టులోని కంప్యూటర్లు సైబర్ దాడికి గురయ్యాయి. దీని వలన ఆ కేంద్రానికి దారితీసే జలమార్గాలు, రోడ్లు భారీగా స్తంభించిపోయాయి. గతంలో జరిగిన ఇరానియన్ సైబర్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రధాన శత్రువు ఇజ్రాయెల్ ఆ సంఘటన వెనుక ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి