
చెప్పడానికేం లేదు.. ఒకటే మాట.. కొన్నేళ్ళుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోడానికి హిట్స్ లేవు.. చేయడానికి చేతిలో సినిమాల్లేవు.. ప్రస్తుతం ఇదే పూజా కెరీర్ తెలుగులో.
కానీ తమిళం, హిందీలో మాత్రం అమ్మడు బాగానే దూకుసుపోతుంది. అక్కడ చేతినిండా సినిమాలున్నాయి. సూర్యతో రెట్రో.. విజయ్ జన నాయగన్ సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.కాంచన 4లోనూ పూజానే హీరోయిన్గా తీసుకున్నారు లారెన్స్.
తమిళంలో బిజీగానే ఉన్నా.. తెలుగులో మాత్రం పూజాను అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగ చైతన్య సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇక ఈ భామ టాలీవుడ్‌పై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బుట్టబొమ్మ.
ఈ మధ్య స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల వైపు అడుగేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్‌లపై ఫోకస్ చేస్తున్నారు. కీర్తి అయితే నెట్ ఫ్లిక్స్ కోసం ఈ మధ్యే అక్క అనే సిరీస్ చేసారు. త్వరలోనే ఇది విడుదల కానుంది.
పూజా హెగ్డే కూడా నెట్ ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. డిమోంటి కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్.. పూజా కోసం ఓ కథ సిద్ధం చేసారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్‌తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.