
అమరావతి, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగుస్తోంది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 15వ తేదీతోనే దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్ధుల విన్నపం మేరకు మరో రెండు రోజులు పొడిగిస్తూ సాంకేతిక విద్య సంచాలకులు ప్రకటించారు. గడువు ఏప్రిల్ 15తో ముగిసిన నేపథ్యంలో 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఎలాంటి ఆలస్య రుసుములేకుండా మరికొంత మంది అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
ఇక గురువారం (ఏప్రిల్ 17)తో దరఖాస్తు గడువు ముగుస్తుండటంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరింది. దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఫలితాలు మే నెలలో విడుదలవనున్నాయి.
తెలంగాణ పాలిసెట్ 2025కు భారీగా తగ్గిన దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్‌కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతేడాది 92 వేల దరఖాస్తులు రాగా ఈ ఏడాది మాత్రం 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, వారిలో 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఏప్రిల్ 19వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. రూ.100 అపరాధ రుసుముతో 21వరకు, రూ.300 అపరాధ రుసుముతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.