కాశీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను దారుణంగా హత్య చేసిన సంఘటనతో నా హృదయం దుఃఖంతో నిండిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. “నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను.. మహాదేవ్ ఆశీర్వాదంతో, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాను” అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఆయన భగవంతుడు మహాదేవ్ పాదాలకు అంకితం చేశారు. ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ వ్యాఖ్య ఉగ్రవాదంపై ఆయన కఠినమైన వైఖరిగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా 20వ విడత పీఎం కిసాన్ నిధులను వారణాసిలో ప్రధాని మోడీ విడుదల చేశారు. సుమారు 9.7 కోట్ల మంది రైతులకు సుమారు రూ.20,500 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేశారు. దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 6 వేల పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల సాయం అన్నదాతలకు అందించింది.
అలాగే, వారణాసిలో 2వేల 200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
