
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత.. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మొపుతామని, ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామంటూ ప్రధాని మోదీ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని తాను అభినందిస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు ప్రధాని మోదీకి ఈ అభినందన తెలియజేశాడో చూద్దాం..
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడి, ఏకంగా 26 మందిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ గురువారం బిహార్లో మాట్లాడుతూ.. “దేశం దుఃఖంలో ఉంది. ఈ దాడి పర్యాటకుల పై దాడి కాదు దేశంపై దాడి. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్నా ఉగ్రవాదులను వదిలి పెట్టం. న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
భారత్ కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ స్పీచ్పై పాక్ మాజీ క్రికెటర్ దినేష్ కనేరియా స్పందిస్తూ.. “ఈ ప్రసంగాన్ని ఇంగ్లీషులో చేసి, ప్రపంచానికి తన హెచ్చరికను గట్టిగా, స్పష్టంగా తెలియజేసేందుకు నరేంద్ర మోదీని నేను అభినందిస్తున్నాను. గాజాలో మాదిరిగానే, ఇది దక్షిణాసియాలో ఉగ్రవాద ముగింపుకు నాంది అని ఆశిస్తున్నాను.” అంటూ ఆయన ట్వీట్ చేశాడు. పలు సందర్భాల్లో దినేష్ ఇండియాకు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..