
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనే మా మంత్రం.. “సబ్కా సాత్, సబ్కా వికాస్” అని ఆయన అన్నారు. దేశం కోసం మేం అదే ఆలోచనతో ముందుకు సాగుతామన్నారు. అధికారం దక్కించుకోవడానికి పగలు రాత్రి ఆటలు ఆడే వారు కుటుంబ అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెడతారని విమర్శించారు. “పరివార్‌కే సాత్, పరివార్ కా వికాస్” వాళ్ల నినాదం అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ రూ.3880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత 10 సంవత్సరాలలో బనారస్ ఎంతో అభివృద్ధి చెందింది. నేడు కాశీ పురాతనమైనది కాదు, అది ప్రగతిశీలమైనది కూడా. కాశీ ప్రేమకు నేను రుణపడి ఉన్నాను. కాశీ నాది, నేను కాశీకి చెందినవాడిని అని మోదీ పేర్కొన్నారు.
తన పార్లమెంటరీ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పూర్వాంచల్‌లో గతంలో ఆరోగ్య సౌకర్యాల కొరత ఉండేదని, కానీ నేడు కాశీ ఆరోగ్య రాజధానిగా మారుతోందని అన్నారు. ఈ రోజు ఢిల్లీ, ముంబైలలోని పెద్ద ఆసుపత్రులు మీ ఇంటి దగ్గరకు వచ్చాయి, ఇది అభివృద్ధి అంటే. గత 10 సంవత్సరాలలో మేం ఆసుపత్రుల సంఖ్యను పెంచడమే కాకుండా రోగుల గౌరవాన్ని కూడా పెంచాం. నేడు ఇండియా అభివృద్ధి, వారసత్వం రెండింటిలోనూ ముందుకు సాగుతోందని, కాశీ దీనికి ఒక అద్భుతమైన నమూనాగా మారుతోందని ప్రధాని వెల్లడించారు. చికిత్స కోసం భూమి అమ్ముకోవాల్సిన అవసరం లేదని, చికిత్స కోసం అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని, చికిత్స కోసం ఇంటింటికీ తిరిగే నిస్సహాయత ఇక ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు మీ చికిత్సకు అయ్యే ఖర్చును ఆయుష్మాన్ కార్డు ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
కాశీలోని ప్రతి ప్రాంతం విభిన్నం..
కాశీలోని ప్రతి ప్రాంతానికి భిన్నమైన సంస్కృతి ఉందని, ప్రతి వీధిలో భారతదేశం విభిన్న రంగు కనిపిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు కాశీని సందర్శించే వారెవరైనా అక్కడి సౌకర్యాలను ప్రశంసిస్తారు. భారతదేశ ఆత్మ దాని వైవిధ్యంలో ఉందని, కాశీ దాని అత్యంత అందమైన చిత్రం అని మోదీ అభివర్ణించారు. ఇక్కడ గంగా ప్రవాహంతో పాటు భారతదేశ చైతన్య ప్రవాహం కూడా ఉంది అని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.