
పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయి, కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్… పహల్గామ్ మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా.. అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలుండాలని చెప్పారు. 13వేల 326 పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనిచేసే వారిని కూలీలు అనొద్దు..
ఉపాధి హామీ పనులు చేసే వారిని కూలీలు అనొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. నరేగా (ఉపాధి హామీ) శ్రామికులు, లేదా గ్రామీణ వికాస శ్రామికులు అనాలని సూచించారు. కూలీ అనేది బ్రిటిషర్స్ నుంచి వచ్చిందని.. గ్రామాభివృద్ధికి పాటు పడేవారు కూలీలు కాదన్నారు పవన్. గ్రామాల్లో అభివృద్ధితోపాటు అవినీతిపైనా దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వ హయాంలో.. గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చాలన్నారు పవన్.
పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్నానని.. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఆకాక్షించారు.. పల్లెల్లో ఉండటమంటే ఇష్టం.. కానీ కుదరలేదంటూ పేర్కొన్నారు. అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని.. గతంలో చాలా తండాల్లో పర్యటించా.. అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్.. ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ నివాళులర్పించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..