
పిల్లల ప్రపంచం మనకంటే వేరుగా ఉంటుంది. వారు చిన్నవాళ్లే అయినా తమకు కావలసిన ప్రేమ, ఆప్యాయత, అర్థం చేసుకునే మనుషుల కోసం మనసులో ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారిని ప్రేమించడమే కాకుండా వారి భావాలను అర్థం చేసుకుని స్పందించాలనుకుంటారు. అయితే పిల్లలు మనసులో ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటారు. వాటిని మాటల్లో చెప్పకపోయినా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.
పిల్లలు తల్లిదండ్రులు తమతో కలిసి గడిపే సమయాన్ని ఎంతో ఇష్టపడతారు. వారి ఆటల్లో పాల్గొనడం, కథలు చెప్పడం, బయటకి తీసుకెళ్లడం లాంటి చిన్న విషయాలు కూడా వారిని ఆనందంతో నింపుతాయి. ఉద్యోగాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి రోజు కనీసం కొన్ని నిమిషాలు పిల్లలతో కేటాయించాలి. ఈ సమయం వారితో బంధాన్ని బలంగా చేస్తుంది.
తమ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తే పిల్లలు మరింత ముందుకు సాగుతారు. చిన్న విజయం అయినా దాన్ని గుర్తించి చాలా బాగుంది, నువ్వు అద్భుతంగా చేశావు అని ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు చిన్న చిన్న విజయాలకు అభినందనలు తెలపడం మంచిది.
పిల్లలు అజ్ఞానం వల్ల పొరపాట్లు చేస్తారు. అప్పుడు కోపంతో స్పందించకూడదు. సహనంగా ఉండి వారి తప్పును వారికి శాంతంగా వివరించాలి. తల్లిదండ్రులు ఓపికగా ఉంటే పిల్లలు కూడా అదే తత్వాన్ని నేర్చుకుంటారు.
పిల్లలు కూడా కొన్ని విషయాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వాటిని చులకన చేయకుండా ఆలోచనగా వింటే వాళ్లలో నమ్మకం పెరుగుతుంది. వాళ్లు చెప్పే మాటలు చిన్నవిగా అనిపించినా అవి వారి దృష్టిలో చాలా గొప్పవిగా ఉంటాయి.
పిల్లలు చదువుపై ఒత్తిడి లేకుండా శ్రద్ధ పెట్టేలా చేయాలి. మార్కులు, ర్యాంకులు కోసం వారికి మానసిక బలం తగ్గించే విధంగా ఒత్తిడి పెట్టకూడదు. వారి నైపుణ్యాలను గుర్తించి వారిలో విద్యపై ఆసక్తి పెంచేలా చేయడం ముఖ్యం.
పిల్లలు తమకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. చిన్న విషయమైనా తమ ఆలోచనల ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలి. అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అన్ని విషయాల్లో నియంత్రించకుండా వాళ్లకు కొన్ని నిర్ణయాలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి.
పిల్లలు తమ భావోద్వేగాలను సరిగ్గా చెప్పలేరు. కానీ వారు దేనికి బాధపడుతున్నారో, ఏమి కోరుకుంటున్నారో తల్లిదండ్రులు గమనించాలి. వారి బాధను అర్థం చేసుకుని ప్రేమగా స్పందిస్తే వారు హాయిగా ఫీల్ అవుతారు.
పిల్లలు ఎటువంటి తప్పు చేసినా వారిని తిట్టడం కాదు వారికి అర్థం అయ్యేలా ఓపికగా, శాంతంగా చెప్పాలి. ఎప్పుడూ వారిపై కేకలు వేయడం వల్ల వారు భయపడతారు మనతో తమ మనసులో ఉన్నది పంచుకోరు.
తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రేమగా, ఓర్పుతో, అర్థం చేసుకునేలా ప్రవర్తించాలి. అలాగే మంచి మార్గాన్ని చూపిస్తే వారు జీవితంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే తల్లిదండ్రులు చూపించే దారి.. ఇచ్చే సహాయం చాలా అవసరం.