
అప్పటి వరకు వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. రోజంతా కాయకష్టం చేసుకుంటూ.. వచ్చిన దానితో త్రుప్తిగా జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలోకి అనుమానం అనే భూతం ఎంటర్ అయింది. దీంతో భార్య ప్రవర్తనపై భర్తకు అపనమ్మకం ఏర్పడింది. రోజంతా కష్టపడితే వచ్చిన డబ్బంతా భర్త, భార్యకు ఇస్తే..ఆమె మరో వ్యక్తికి ఇస్తుందనే అనుమానం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్నగా మొదలైన గొడవలు కాస్త ప్రాణాల మీదకు తెచ్చుకునేంత వరకు వెళ్లాయి. అసలు ఆ భార్య భర్తల మధ్య ఏం జరిగింది. మరీ ప్రాణాలు తీసే వరకు ఎందుకెళ్లిందో ఒకసారి చూద్దాం పదండి.
వివరాల్లోకి వెళితే .. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం చెంచుకాలనీకి చెందిన చర్ల శ్రీను, మంగమ్మ దంపతులకు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం…ఇందులో ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించారు. దిష్టి బొమ్మలు అమ్ముకుంటూ ఈ భార్యభర్తలు జీవనం సాగిస్తుంటారు. ఊరూరా తిరిగి దిష్టిబొమ్మలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో భర్త శ్రీను కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడి తెచ్చి ఇచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోవడం..గత కొంతకాలంగా భార్య మంగమ్మ ప్రవర్తనలో మార్పును గమనించాడు భర్త శ్రీను. దీంతో భార్యపై అతనికి అపనమ్మకం ఏర్పడింది. కష్టపడిన సొత్తంతా ఖర్చయిపోవడంతో శ్రీను పదే పదే మంగమ్మను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మంగమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ డబ్బులన్నీ అతనికే ఇస్తుందనే భావనకు వచ్చాడు. ఇదే విషయంపై తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. తాజాగా ఓ రోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. కొద్దీసేపటి తర్వాత ఆవేశం ఆపుకోలేని శ్రీను ఇంట్లో ఉన్న బ్లేడ్ తో మంగమ్మ గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన మంగమ్మను స్థానికులు సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మంగమ్మ చికిత్స పొందుతుంది.
కాపురంలో వచ్చిన కలతలతోనే శ్రీను భార్యపై బ్లేడ్ తో దాడి చేశాడని స్థానికులు కూడా చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీను కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం మంగమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…