

గోదావరి జిల్లా వాసుల సాంప్రదాయ వంటల్లో పాలముంజలు కూడా ఒకటి. వీటిని పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా తయారు చేస్తారు. అయితే కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసే ఈ పాల ముంజలను నచ్చినప్పుడు మనసులో స్వీట్ తినాలనిపించినప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు టేస్టీ టేస్టీ పాలముంజలను ఎలా తయారు చేసుకోవాలి రెసిపీ తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
- పాలు – 2 కప్పులు
- బియ్యం పిండి – అర కప్పు
- సుజీ రవ్వ – పావు కప్పు
- కొబ్బరి తురుము – 2 కప్పులు
- బెల్లం పొడి – 1 కప్పు
- యాలకుల పొడి – 1 టీస్పూన్
- నెయ్యి – కావలసినంత
- చక్కెర లేదా పటిక బెల్లం పొడి – 2 టీస్పూన్లు
- ఉప్పు – చిటికెడు
- నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తయారీ విధానం: కొబ్బరిని తురుముకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి.. అర కప్పు నీరు పోసుకుని అందులో కప్పు బెల్లం పొడిని వెసుకుని కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత అందులో కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. దీనికి కొంచెం నెయ్యి జోడించి కొబ్బరి లౌజు అయ్యే వరకూ ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఓ పక్కకు పెట్టుకోండి. గోరు వెచ్చగా అయ్యాక మీడియం సైజ్ ఉండలుగా చేసుకుని ఒక పక్కకు పెట్టండి.
ఇప్పుడు మరో గిన్నె తీసుకుని రెండు కప్పుల పాలు కొంచెం పటిక బెల్లం పొడిని వేసి వేడి చేయాలి. ఇందులో పావు కప్పు సుజీ రవ్వ, అరకప్పు బియ్యం పిండి , చిటికెడు ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన బియ్యం పిండిని తీసుకుని పూరీలా చేసి దానిలో కొబ్బరి లౌజు ఉండలు పెట్టి నెమ్మదిగా బియ్యం పిండి మిశ్రమంతో ఆ కొబ్బరి ఉండ కనిపించకుండా మూసివేయండి. ఇలా అన్ని రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకోండి. నూనె వేడి ఎక్కిన తర్వాత ఈ రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉండలు వేసి మీడియం మంట మీద వేయించండి. ఇలా అన్నిటిని వేయించుకుని ఒక ప్లీట్ లోకి తీసుకోవాలి. అంతే గోదావరి వాసుల స్పెషల్ రుచికరమైన పాల ముంజలు రెడీ. వీటిని వేడిగా తిన్నా లేదా చల్లారిన తరువాత తిన్నా రుచికరంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..