

ఆహా..! ఏమా ప్రకృతి సౌందర్యం..! చుట్టూ పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, స్పష్టమైన నీలి ఆకాశం, మండు వేసవిలోనూ పాలనురగల పరవళ్లు. మంచు కొండలే పిలుస్తున్నాయా అనేలా అద్భుత అనూభూతి కలిగించే వాతావరణం. అదే కశ్మీర్‌లోని హెవెన్ ఆన్ ఎర్త్‌గా పిలవబడే పహల్గామ్. మినీ స్విట్జర్లాండ్‌గానూ పిలుచుకునే భూతలస్వర్గం.. పహల్గామ్.. జమ్ముకశ్మీర్‌లోని అద్భుత పర్యాటక ప్రాంతం. స్వర్గమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉండే ప్రకృతి సోయగం. వేడి వాతావరణంలో చల్లటి ప్రదేశానికి.. చల్లటి వాతావరణంలో మంచు కురిసే ప్రాంతానికి వెళ్లాలనిపిస్తే… పహల్గామ్ వెళ్తే సరిగ్గా సరిపోతుంది. జనవరి నుంచి మార్చి వరకు మంచు ముచ్చటగొలిపేలా చేస్తే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ పచ్చదనం మంత్ర ముగ్దుల్ని చేస్తుంది.
అమెరికా, కెనడా, రష్యా, స్విడ్జర్లాండ్‌లో ఎలాగైతే మంచు ముద్దలుగా కురుస్తుందో అలాంటి అందమైన ప్రదేశమే పహల్గామ్. ఇక్కడ కనిపించే హిమపాతాలు స్వర్గాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటాయి. నిశ్శబ్ద వాతావరణం, గాలి కాలుష్యం లేకుండా ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది పహల్గామ్. అలాగే చార్ధామ్ యాత్ర కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. పహల్గామ్లో ఎన్నో చూడవలసిన ప్రదేశాలున్నాయి. డెస్పరేట్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్వారీ, లిడర్ పార్క్, కొలాహోయ్ హిమానీనదం వంటి ప్రదేశాలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఇటు సరస్సులకు ఏం తక్కువ కాదు పహల్గామ్. తులియన్ సరస్సు, శేషనాగ్ సరస్సు , టార్సార్ వంటి సరస్సులు నిర్మలమైన సౌందర్యానికి ప్రసిద్ధి.
ఇంతటి ప్రకృతి అందాలు ఉన్నాయి కాబట్టే పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఫోటోగ్రఫీ, పిక్నిక్ల కోసం దేశవిదేశాల నుంచి ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. గుర్రాలు, కాలినడకన మాత్రమే చేసుకునే ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు దేశ, విదేశీయులు.
అలాంటి భూతల స్వర్గం పహల్గామ్లో ఉగ్రదాడి.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా కాల్పులకు తెగబడ్డారు. ఆర్తనాదాలు చేస్తున్నా.. తమను వదిలేయమని బతిమాలినా.. ఏమీ చేయొద్దంటూ కాళ్లావేళ్లా వేడుకున్నా ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి 28 మందిని టూరిస్టులను బలితీసుకున్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా.. ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి..
ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు.. అణువణువూ గాలిస్తున్నాయి.. నింగి, నేల ఏదీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో.. క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి.
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బిహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్దం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..