
పహల్గామ్, ఏప్రిల్ 25: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారానికి భారత ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 25) జమ్ముకశ్మీర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దాడి నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ లోభద్రతా పరిస్థితిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించనున్నారు. శ్రీనగర్‌లో భద్రతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉగ్ర దాడి జరిగిన బైసరన్ వ్యాలీని సైతం ఆయన సందర్శించనున్నారు. కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి స్థానిక సైనిక విభాగాల అగ్ర కమాండర్లు ఆర్మీ చీఫ్ కి వివరించనున్నారు.
జమ్ముకాశ్మీర్ పర్యటనలో ఆర్మీ చీఫ్ తో పాటు 15 కార్ప్స్ కమాండర్ సహా రాష్ట్రీయ రైఫిల్స్ ఫార్మేషన్ కమాండర్లు సైతం ఉన్నారు. నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సచీంద్ర కుమార్‌తో సహా అత్యున్నత సైనిక అధికారులతో ఆర్మీ చీఫ్ సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు అగ్రశ్రేణి సైనికాధికారుల తరలింపు పూర్తైంది. జమ్ముకాశ్మీర్ లో హై అలర్ట్‌లో ఉండాలని, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని సైనికులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గాలింపు చర్యలు, నిఘా వ్యవస్థ, ఉగ్రవాద చొరబాట్లను నిరోధించడంపై సైన్యం దృష్టి పెట్టింది.
కాగా ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో రెసిస్టెన్స్ ఫోర్స్ (RTF)కి చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతానే కాదు ప్రపంచాన్ని కూడా తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అదీ మతం అడిగి మరీ దాడులకు పాల్పడటం ప్రతి ఒక్కరి రక్తం మరిగించింది. దీనికి ప్రతీకార చర్యగా భారత్ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.