
ఉగ్రవాదుల అమానుష చర్య. వెతికి మరీ, గుర్తుపట్టిమరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య- ప్రపంచానికి షాక్కు గురిచేసింది. జమ్ముకశ్మీర్ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడి. మొత్తం 28 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘాతుకంపై ఆసేతుహిమాచలం కుతకుత ఉడికిపోతోంది. పహల్గామ్ ఉగ్ర దాడిలో పాకిస్తాన్ కుట్ర బట్టబయలైంది.. ముష్కరుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా సంస్థలు అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు వారి స్కెచ్లను విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. కాల్పులు జరిపిన మూకలో పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ ఉన్నట్లు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలను భద్రతా దళాలు సేకరిస్తున్నాయి.. నరమేధానికి నలుగురు ఉగ్రవాదులు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఉగ్రవాదుల్లో ఆసిఫ్తోపాటు సులేమాన్, అబూ ఉన్నారని.. ఉగ్రవాదుల భాష, మాండలికం వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యక్షసాక్షుల నుంచి NIA బృందం పలు కీలక వివరాలను సేకరించింది. టెర్రరిస్టులు పష్తూన్ భాషలో మాట్లాడినట్లు గుర్తించారు.. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో ఈ నలుగురు టచ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదులంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా గుర్తించారు.
కాగా.. జమ్ము కాశ్మీర్లో 120 మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. పాకిస్తాన్లో శిక్షణ పొందిన భారత్లోకి చొరబడినట్టు గుర్తించారు. వీరికి స్థానికంగా 10 మంది ఉగ్రవాదులు సహకరిస్తున్నారని.. కాశ్మీర్ లోయలో దాదాపు 75 మంది, జమ్మూ ప్రాంతంలో దాదాపు 50 యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు భారీ ఆపరేషన్ చేపట్టేందుకు సైనిక బలగాలు సమాయత్తమవుతున్నాయి..