

పహల్గాం, ఏప్రిల్ 23: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన ఉగ్రవాద దాడిపై భద్రతా సంస్థల నుంచి మరో సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలానికి సమీపంలో ఓ అనుమానాస్పద బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బ్లాక్ కలర్లో ఉన్న ఈ బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం విశేషం. ఈ బైక్‌పై ముగ్గురికిపైగా ఎక్కువ మంది ఉగ్రవాదులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు అక్కడికి చేరుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాద దాడి కోసం OGW ఉగ్రవాదులకు బైక్‌లను అందించి ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. సంఘటనా స్థలానికి సమీపంలో లభించిన అనుమానాస్పద బైక్ ఎవరిదో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కి తమ మద్దతును తెలియజేస్తున్నాయి. పహల్గామ్లో దాడి జరిగిన ప్రదేశం దగ్గర నంబర్ ప్లేట్ లేని నల్లటి బైక్ ఎవరిది? అనే విషయం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ‘లష్కరే తోయిబా’ బాధ్యత వహిస్తూ ప్రకటన జారీ చేసింది. కాల్పుల అనంతరం ఉగ్రమూక సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు.
పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దారుణమైన దాడిలో అమాయక ప్రజల మరణించడాన్ని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ విభాగం, జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జమ్మూ బార్ అసోసియేషన్, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ్ దళ్ సహా పలు సంఘాలు బుధవారం పూర్తి రోజు జమ్మూ బంద్‌కు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.