

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ కు వెళ్లే సింధు నది జలాలను నిలిపివేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ నటులు, సాంకేతిక నిపుణులు భారతీయ చిత్రాలలో పనిచేయకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్ నటించిన భారతీయ చిత్రం ‘అబీర్ గులాల్’ విడుదలకు అనుమతించబోమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో చిత్ర బృందానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ సినిమాను నిషేధించింది! దీని గురించి పాకిస్తానీ చిత్ర పంపిణీదారు సతీష్ ఆనంద్ మాట్లాడుతూ, ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తాన్లో విడుదల కావడం లేదని అన్నారు. ‘ ఈ సినిమాలో ఒక భారతీయ హీరోయిన్ (వాణీ కపూర్) ఉండటం వల్లే ఆ సినిమాను విడుదల చేయడానికి అనుమతి లేదు’ అని ఆయన అన్నారు. ‘విడుదల సమయం సరిగా లేకపోవడం వల్ల, సినిమా నిర్మాతలుచ పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు’ అని ఆయన అన్నారు. మొత్తానికి ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తానీ నటుడు నటించినందుకు భారతదేశంలోనూ, భారతీయ నటి నటించినందుకు పాకిస్తాన్‌లోనూ నిషేధానికి గురైంది.
ఫహద్ ఖాన్ ఒక పాకిస్తానీ సినీ నటుడు. గతంలో పలు భారతీయ చిత్రాలలో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. అంతేకాదు ఫహద్ ఖాన్ పాకిస్తానీ టీవీ సీరియల్స్‌లోనూ నటించాడు. ఫహద్ ఖాన్ పాకిస్తానీ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అతను నటించిన ‘మౌలా జాట్’ చిత్రం కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్‌తో పాటు భారతదేశంలో కూడా విడుదలైంది. ఫహద్ ఖాన్ తప్ప ‘అబీర్ గులాల్’ సినిమాలోని ఇతర నటులు, నటీమణులందరూ భారతీయులే. కానీ ఆ సినిమాలో ఫహద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించడం వల్ల ఆ సినిమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రంలో వాణి కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆర్తి ఎస్. బగాడి దర్శకత్వం వహించారు.
ఫహద్ ఖాన్ చివరిగా నటించిన భారతీయ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’. అప్పుడు కూడా, పాకిస్తానీ నటుడిని ఎంపిక చేయడంపై వివాదం చెలరేగింది. ఆ తర్వాత పాకిస్తాన్ నటులు భారతీయ చిత్రాలలో నటించకుండా నిషేధం విధించారు. కానీ ఈ నిషేధాన్ని 2023లో ఎత్తివేశారు. అంతే కాదు, ఈ సంవత్సరం భారతదేశంలో పాకిస్తానీ సినిమాలు విడుదల కావడంపై నిషేధాన్ని కూడా ఎత్తివేశారు. ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.