
కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో మంగళవారం (ఏప్రిల్ 8) అర్ధరాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి జెట్ సెట్ అనే నైట్ క్లబ్ పైకప్పు కూలడంతో దాదాపు 218 మంది మృత్యువాత పడ్డారు. అప్పటి వరకూ ఎంతో ఉల్లాసంగా గంతులు వేస్తూ సంతోషంగా ఉన్న నైట్ క్లబ్ ఒక్కసారిగా భీతావాహకంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిధిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే ఆశలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో 218 మంది మృతి చెందగా.. 189 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగినట్లు ఆ దేశ అత్యవసర కార్యకలాపాల డైరెక్టర్ జువాన్ మాన్యుయెల్ మెండెజ్ గురువారం స్థానిక మీడియాకు తెలిపారు. 150 మంది గాయపడగా.. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. శిధిలాల కింద ఉన్న బాధితులు చనిపోయినా, సజీవంగా ఉన్నా ప్రతి ఒక్కరినీ కాపాడతామన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారు ఎవరూ కనిపించలేదని ఆయన అన్నారు. ఇంకా శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయన్నారు.
అసలేం జరిగిందంటే..
జెట్సెట్ క్లబ్లో మంగళవారం అర్ధరాత్రి 12:44 గంటల సమయంలో లోపల ఉన్న వారి పానియాల్లో పైనుంచి దుమ్ముపడటం గమనించారు. అప్పుడు అక్కడ ప్రసిద్ధ మురాంగే గాయకుడు రూబీపెరెజ్ పదర్శన ఇస్తున్నారు. అంతా ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో క్లబ్లో వెయ్యి మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఘటనలో మురాంగే గాయకుడు రూబీపెరెజ్ కూడా మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బుధవారం అధికారులు వెలికి తీశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. సంఘటన జరిగిన ప్రాంతంలో బాధితుల బంధువులు తమవారి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అధికారులు 54 మంది బాధితుల పేర్లను ప్రకటించి, 28 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఇంకా 33 మంది మృతదేహాలను గుర్తించలేదు. గాయాలతో బయటపడిన వారిలో చాలా మంది ఆరు, ఏడు, ఎనిమిది గంటలకు పైగా శిథిలాల కిందనే అల్లాడారు. తీవ్ర గాయాలతో నలిగిపోయి, రక్తస్రావంతో నరకయాతన అనుభవించిన బాధితులను రెస్క్యూ టీం కాపాడి ఆస్పత్రికి తరలించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.