
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలో ఆయన కన్నుమూశారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. ఈస్టర్ సందేశం కూడా ఇచ్చారు. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. 2013లో ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. 1936లో లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. లాటిన్ అమెరికా నుంచి పోప్‌గా ఎంపికైన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచం ఘననివాళి అర్పిస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పూరీ బీచ్‌లో పోప్ ఫ్రాన్సిస్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించారు సుదర్శన్ పట్నాయక్.
తదుపరి పోప్ ఎవరు ?
తదుపరి పోప్ ఎవరు ? పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్ రేసు ప్రారంభమయ్యింది. ఇటలీకి చెందిన పియట్రో పెరొలిన్ రేసులో ముందున్నారు. ఘనాకు చెందిన పీటర్ టర్క్సన్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్లిద్దరు కూడా పోప్ ఫ్రాన్సిస్‌కు గట్టి మద్దతుదారులు. కార్డినల్ పీటర్ టర్క్సన్ ఆఫ్రికాలో క్యాథలిక్స్ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్డినల్ లూయిస్ ఆంటోనియో కూడా పోప్ పదవి చేపట్టే అవకాశం ఉంది. హంగరీకి చెందిన పీటర్ హర్డో , ఉక్రెయిన్‌కు చెందిన మైకోల బైచోక్ కూడా పోప్ పదవి కోసం పోటీ పడుతున్నారు.
పోప్ చనిపోయిన నాటి నుంచి కొత్త పోప్‌ను ఎన్నుకునేంత వరకు ఉండే సమయాన్ని లాటిన్ భాషలో సెడె వెకెంటే అంటారు. పీఠం ఖాళీగా ఉందని దీనర్థం. ఈ సమయంలో కాలేజీ ఆఫ్ కార్డినల్స్ వాటికన్ వ్యవహారాలు చూస్తాయి. కాని ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోదు. కొత్త పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ రెండు, మూడు వారాల్లో ప్రారంభమవుతుంది. కొత్త పోప్ ఎన్నిక వ్యవహారం చాలా రహస్యంగా జరుగుతుంది. ఆయనను ఎన్నుకునే సభ్యుల బృందాన్ని కాంక్లేవ్ అంటారు. 80 ఏళ్లలోపు వయస్సున్న కార్డినల్స్కు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ ఓటింగ్ అనేక దఫాలుగా జరుగుతుంది.
మొత్తం 138 మంది కార్డినల్స్
ప్రస్తుతమున్న కార్డినల్స్లో 80 శాతం మందిని పోప్ ఫ్రాన్సిస్సే నియమించారు. మొత్తం 138 మంది కార్డినల్స్ ఉన్నారు. ఇందులో భారత్ నుంచి నలుగురు ఉన్నారు. హైదరాబాద్ ఆర్చ్‌బిషప్ పూల ఆంథోని అందులో ఒకరు. ఆయనతో పాటు గోవా కార్డినల్ ఫిలెప్పీ నెరీ ఫెరారో , కేరళకు చెందిన కార్డినల్ క్లీమీస్ బసేలియోస్ , జార్జ్ జాకబ్ పోప్ ఎన్నిక ఓటింగ్‌కు హాజరవుతారు.
కార్డినల్ పూల ఆంథోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దళిత వర్గం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయ కార్డినల్‌గా ఆయన రికార్డు సృష్టించారు. పోప్‌గా ఎన్నికయ్యే వ్యక్తికి మూడింట రెండొంతల మెజార్టీ రావాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోని పక్షంలో వాటికన్ సిస్టైన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ విడుదల చేస్తారు. దానర్థం ఓటింగ్ ఇంకా కొనసాగుతోందని అర్థం.
ఒకవేళ పోప్‌ను కార్డినల్స్ ఎన్నుకున్నట్టు అయితే సిస్టైన్ చాపెల్ నుంచి తెల్ల పొగ విడుదల చేస్తారు. కొత్తగా ఎన్నుకున్న వ్యక్తిని ఆ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా అని అడుగుతారు. వారు ఒప్పుకున్నట్టు అయితే వాటికన్ సెయింట్ పీటర్స్ బెసిలికా బాల్కనీ నుంచి ఆయనను ప్రపంచానికి పరిచయం చేస్తారు. పోప్‌గా ఆయనకు కొత్త పేరు పెడతారు.