
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి (64) పేరును నామినేట్ చేస్తూ బుధవారం (ఏప్రిల్ 16) కేంద్రానికి సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బీఆర్ గవాయిని తదుపరి సీజేఐగా ఆయన నామినేట్ చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ప్రభుత్వం ఆమోదం పొందితే భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయి నియామకమయ్యే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. దీంతో ఈ ఏడాది నవంబర్ 23 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఏడాది (2025) మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన దాదాపు 7 నెలల పాటు CJI గా పనిచేశారు. జస్టిస్ ఖన్నా 2019 జనవరి 18న ఢిల్లీ హైకోర్టు నుంచి పదోన్నతి ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. 2024 నవంబర్ 10న ఆయన 51వ CJIగా నియమితులయ్యారు.
ఎవరీ జస్టిస్ బీఆర్ గవాయి?
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ మార్చి 16, 1985న బార్లో చేరారు. 1987 వరకు బాంబే హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్‌గా న్యాయమూర్తి రాజా ఎస్ భోంస్లేతో కలిసి పనిచేశారు. 1990 తర్వాత ఆయన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు రాజ్యాంగ, పరిపాలనా చట్టంలో ప్రాక్టీస్ చేశారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి విశ్వవిద్యాలయం స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా ఆయన పనిచేశారు.
జస్టిస్ గవాయ్ ఆగస్టు 1992 నుంచి జూలై 1993 వరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, జనవరి 17, 2000 నుంచి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నవంబర్ 12, 2005న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అనేక చారిత్రక తీర్పులలో జస్టిస్ గవాయ్ భాగంగా ఉన్నారు. జనవరి 2023 నాటి సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పుల్లోనూ ఆయన భాగమే. 2016లో కేంద్రం తీసుకున్న రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయంతోపాటు, షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణను అనుమతించే ఆగస్టు 1, 2024 తీర్పుతో జస్టిస్ గవాయ్ ఏకీభవించారు. ఇక జస్టిస్ గవాయ్‌తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని సైతం సమర్థించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కూడా రద్దు చేసింది. నవంబర్ 2024లో జస్టిస్ గవాయ్ అధ్యక్షతన ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం నేరస్థుల ఆస్తులపై బుల్డోజర్ల వాడకాన్ని విమర్శించింది. తగిన ప్రక్రియను పాటించకుండా పౌరుల ఆస్తులను కూల్చివేయడం చట్ట నియమాలకు విరుద్ధమని తీర్పునిచ్చింది. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చారిత్రక తీర్పులలో జస్టిస్ గవాయ్ భాగంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.