కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. NEET-PG 2025 అర్హత కటాఫ్‌ను గణనీయంగా తగ్గించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 9000 కి పైగా PG మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. దేశంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన ప్రమాణాల ప్రకారం జనరల్ కేటగిరీ, EWS అభ్యర్థుల అర్హత శాతం 50 శాతం నుంచి 7 శాతానికి తగ్గించబడింది. బెంచ్‌మార్క్ వైకల్యం (PwBD) ఉన్న జనరల్ కేటగిరీ వ్యక్తులకు ఇది 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అదేవిధంగా, SC, ST, OBC అభ్యర్థులకు 40 శాతం నుంచి 0కి తగ్గించింది. తాజా సవరణతో కటాఫ్ స్కోరు 800 మార్కులకు గానూ 40 మార్కులు వచ్చిన వారు కూడా పీజీ మెడికల్ సీట్ పొందొచ్చన్నమాట. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం (జనవరి 13) నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) PG 2025 అర్హత కట్-ఆఫ్‌ను తగ్గించింది.
కొత్త అర్హత కట్-ఆఫ్ కింద NEET UG 2025లో మైనస్ 40 స్కోర్ చేసిన SC, ST, OBC అభ్యర్థులు MS/MD వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి అర్హులు. అంటే వారు స్పెషలిస్ట్ వైద్యులుగా ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ దొరికినట్లే. జనరల్, EWS అభ్యర్థులకు కూడా అర్హత కట్-ఆఫ్ తగ్గించారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దేశ వైద్య విద్యా వ్యవస్థ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వైద్యుల వద్ద చికిత్స పొందడానికి జనాలు భయపడతారని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. NEET PG 2025 అర్హత కటాఫ్‌ను భారీగా తగ్గించడంపై సెటైర్లు వేస్తున్నారు.
ఖాళీగా ఉన్న పెద్ద సంఖ్యలో సీట్లను భర్తీ చేయడానికి కటాఫ్‌లో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధి బృందం జనవరి 12న కేంద్ర ఆరోగ్య మంత్రి J.P. నడ్డాకు రాసిన లేఖతో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ డిమాండ్‌కు ప్రతిస్పందిస్తూ NBEMS అధికారులు ప్రవేశ పరీక్ష ఉద్దేశ్యం మెరిట్ జాబితాను సిద్ధం చేయడమే తప్ప MBBS, విశ్వవిద్యాలయ పరీక్షలలో ఇప్పటికే ఉత్తీర్ణులైన వైద్యుల అర్హతలను తిరిగి మూల్యాంకనం చేయడం కాదని పేర్కొన్నారు. అయితే, కటాఫ్ మార్పు పరీక్ష స్కోర్లను లేదా ర్యాంకింగ్‌లను మార్చదని, కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ఎవరు అర్హులో మాత్రమే నిర్ణయిస్తుందని NBEMS స్పష్టం చేసింది. ఇప్పటికే అర్హత కలిగిన వైద్యులను ర్యాంక్ చేయడానికి పర్సంటైల్ వ్యవస్థను ఉపయోగిస్తారని, అన్ని PG సీట్లను భర్తీ చేయడానికి తగినంత మంది అభ్యర్థులు ఉన్నారని నిర్ధారించడానికి కటాఫ్‌ను తగ్గించామని అధికారులు వివరించారు.
ఇవి కూడా చదవండి
NEET PG 2025 అర్హత కటాఫ్‌ను తగ్గించడాన్ని ప్రశ్నిస్తూ THE SKIN DOCTOR అనే హ్యాండిల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వరుస పోస్ట్‌లు చేసింది. ఆ పోస్ట్‌లో, ఇప్పటివరకు SC, ST, OBC అభ్యర్థులకు PG మెడికల్ సీట్లకు కనీస అర్హత ప్రమాణం 40వ శాతం అంటే 800లో దాదాపు 235 శాతం. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దీనిని 0 శాతానికి తగ్గించారు. అంటే 800లో మైనస్ 40 శాతం స్కోరు ఉన్నవారు కూడా ఇప్పుడు అర్హులు అవుతారు. జీవితం మరణంతో నేరుగా ముడిపడి ఉన్న వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. ఇక్కడ సామర్థ్యం పవిత్రమైనది. ఎక్కడా రాజీపడనిది. కానీ ప్రస్తుతం వైద్య వృత్తి ఈ స్థాయికి దిగజారింది. ప్రమాణాలలో ఇంత ప్రమాదకరమైన క్షీణతను సహించడమే కాకుండా దగ్గరుంచి ప్రోత్సహించే ఏకైక దేశం బహుశా భారత దేశమే కావచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
