
న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నీట్, సీయూఈటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్యార్ధులకు ఉచిత కోచింగ్ అందించనుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1.63 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యా మంత్రి ఆశిష్ సూద్ సమక్షంలో NSDC ఇంటర్నేషనల్, నైపుణ్య మంత్రిత్వ శాఖ, ఫిజిక్స్ వల్లా లిమిటెడ్ సంయుక్తంగా బిఐజితో విద్యా డైరెక్టరేట్ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.
ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిగ్ ఇన్స్టిట్యూట్, ఫిజిక్స్‌వాలాతో పాటు ఎన్ఎస్డీసీ ఇంటర్నేషనల్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖలు సంయుక్త చొరవతో ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. ఈ మేరకు సీఎం రేఖాగుప్తా, విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ సమక్షంలో సంబంధిత విభాగాలకు చెందిన ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఏప్రిల్ 2 నుంచి మే 2వరకు రోజూ ఆరు గంటల చొప్పున విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులను కవర్ చేస్తూ ఆన్లైన్ బోధన కొనసాగించనున్నారు. మొత్తంగా విద్యార్థులకు 180 గంటల ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వ విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. నీట్-2025, సీయూఈటీ (యుజీ)-2025లకు సిద్ధం కావడానికి 30 రోజుల ఉచిత ఆన్లైన్ కోచింగ్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఇది వైద్య కళాశాలలు, కేంద్ర విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ విద్యా ఆకాంక్షలను నెరవేర్చుకోలేని విద్యార్థులకు ఈ చొరవ సహాయపడుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడం, గరిష్ట భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం నిబద్ధత కనబరుస్తుందని, ఈ చొరవ విద్యార్థులకు కీలకమైన పరీక్షలలో రాణించడానికి అవసరమైన మార్గదర్శకత్వంతో సన్నద్ధం చేస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.