
ఔరంగజేబు సమాధి చుట్టూ మహారాష్ట్రలో రాజకీయ, మతపరమైన వివాదాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాల అల్లర్లతో నాగ్‌పూర్ అట్టుడుకుతోంది. దాడులు- ప్రతిదాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి.. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమైయ్యాయి. దీంతో నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మొఘల్ రాజు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్‌తో సోమవారం కొన్ని సంఘాలు ర్యాలీ నిర్వహించారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగింది. ఈ క్రమంలోనే పలు పుకార్లు వ్యాపించడంతో మహల్ ఏరియాతోపాటు.. పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది దాడులు- ప్రతిదాడులకు కారణమైంది. చాలామంది గాయపడగా.. కొన్ని బైక్‌లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.
అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హసన్‌పురి ప్రాంతంలో మళ్లీ దాడులు జరిగాయి. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. కార్లు, స్కూటర్లు, బైక్‌లు, ఆటోలు.. ఇలా ఇష్టానుసారంగా కనిపించిన వాహనాలను కనిపించినట్టే తగులబెట్టారు. వాటి అద్దాలను పగులగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయడంతో వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన ఘర్షణల్లో 20మంది గాయపడ్డారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ నికేతన్ కదమ్ తీవ్రంగా గాయపడ్డారు.
రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు.. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నాగ్‌పూర్ పోలీసులు కర్ఫ్యూ విధించారు. నాగ్‌పూర్‌లోని 10 పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని.. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా ఉద్రికత్తలు నెలకొన్న ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు అల్లర్లకు కారణమైన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని.. ప్రస్తుతం నాగ్‌పూర్ లో ప్రశాంత పరిస్థితి నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. పుకార్ల నేపథ్యంలో నాగ్‌పూర్‌లో హింసాత్మక సంఘటనలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వదంతులను నమ్మవద్దు: సీఎం ఫడ్నవీస్
కాగా.. అల్లర్లకు పాల్పడినవారిని ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని.. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. అయితే వదంతులను నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలను కోరారు.
నాగ్‌పుర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై పోస్టు చేశారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..