మనుషుల శరీరంపై ఎక్కడో ఓ చోట పుట్టుమచ్చలు ఉండటం సహజమే. ఆ పుట్టు మచ్చలు ఉన్న చోటును బట్టి ఆ మనిషి వ్యక్తిత్వం, వారు ఎదుర్కొనే ఫలితాలను సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది.శరీరంపై ఏయే చోట్ల పుట్టు మచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. పుట్టు మచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఎలాంటివో చెబుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం, శరీరంపై వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు మనకు కలిగే లాభనష్టాలు, సంపద, వివాహం, కీర్తి వంటి అంశాలను సూచిస్తాయని విశ్వసిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ
కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్నవారికి వివాహం త్వరగా జరుగుతుందని శాస్త్రంలో పేర్కొన్నారు.
కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ
ఇలాంటి వారికి మంచి సంపదతో పాటు వాహన సౌఖ్యం కలుగుతుందని చెబుతారు.
ముఖంపై పుట్టుమచ్చల ఫలితాలు
ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు ఉన్న పురుషులు అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.
అయితే ఎడమ వైపున పుట్టుమచ్చలు ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయని సముద్రిక శాస్త్రం వివరిస్తుంది.
పుట్టుమచ్చపై వెంట్రుకలు ఉంటే
పుట్టుమచ్చపై వెంట్రుకలు ఉన్నవారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారని చెబుతారు.
అలాగే రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న మగవారికి దీర్ఘాయుష్షు ఉంటుందని శాస్త్రంలో పేర్కొన్నారు.
తల లేదా నుదుటిపై పుట్టుమచ్చ
మగవారి తలపై పుట్టుమచ్చ ఉంటే గర్వ స్వభావం ఎక్కువగా ఉంటుందని అంటారు.
నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే మంచి పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. వీరికి ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంటుంది.
ముక్కు, చెవిపై పుట్టుమచ్చలు
ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారిలో క్రమశిక్షణ కొద్దిగా లోపిస్తుందని చెబుతారు.
చెవిపై పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి అధికంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు.
పెదవిపై పుట్టుమచ్చ
పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారిలో ఈర్ష్య భావన ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా బంధువులు, స్నేహితుల విషయంలో ఇది కనిపిస్తుందని చెబుతారు.
నాలుకపై పుట్టుమచ్చ
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు తెలివితేటలు కలిగి, మంచి విద్యావంతులు అవుతారని శాస్త్రంలో పేర్కొన్నారు.
గడ్డంపై పుట్టుమచ్చ
గడ్డంపై పుట్టుమచ్చ ఉన్న పురుషులు ఉదార స్వభావం కలిగి ఉంటారు.
అదే మహిళలకు గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే భక్తి భావన ఎక్కువగా ఉంటుందని చెబుతారు.
భుజంపై పుట్టుమచ్చ
భుజంపై పుట్టుమచ్చ ఉన్నవారు మంచి మర్యాదస్తులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.
