
హిందూ మతంలో మోహిని ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు అవతారమైన మోహిని రూపాన్ని పూజిస్తారు. సముద్ర మథనం నుంచి అమృతం ఉద్భవించినప్పుడు.. ఆ అమృతాన్ని రాక్షసుల నుంచి రక్షించవలసి వచ్చినప్పుడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. ఆ రోజు వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి.. దీంతో అప్పటి నుంచి ఈ ఏకాదశికి మోహినీ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనిషి చేసిన అన్ని పాపాలు నశించి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. ఈ ఉపవాసం ప్రభావం వల్ల మనిషి ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందుతాడు. మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి ఆవులను దానం చేసినంత సమానమైన పుణ్యం లభిస్తుంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి.
పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి తేదీ మే 7న ఉదయం 10:19 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే మే 8వ తేదీ మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, మోహిని ఏకాదశి పండుగ మే 8న మాత్రమే జరుపుకోవాలి. మే 9న మోహిని ఏకాదశి ఉపవాసం విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఉపవాసం విరమణకు శుభ సమయం ఉదయం 6:06 నుంచి 8:42 వరకు ఉంటుంది.
మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలంటే
- మోహిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి.
- విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి.
- విష్ణువును గంధం, బియ్యం, పువ్వులు, తులసి దళాలు, ధూపం, దీపంతో పూజించండి.
- మోహినీ ఏకాదశి కథ వినండి లేదా చదవండి. రోజంతా ఉపవాసం ఉండండి ( పండ్లు తినవచ్చు)
- విష్ణువు మంత్రాలను జపించండి. రాత్రి జాగారం చేసి విష్ణువు స్తోత్రాలు జపించండి.
- మరుసటి రోజు ద్వాదశి తిథి రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి, దానధర్మాలు చేసి, ఉపవాసం విరమించాలి.
- మోహిని ఏకాదశి ఉపవాసాన్ని విశ్వాసం , భక్తితో పాటించడం ద్వారా, విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి.
మోహిని ఏకాదశి ఎందుకు జరుపుకుంటారంటే
దేవతలు (దేవతలు), రాక్షసులు (అసురులు) సముద్రాన్ని మథించినప్పుడు అమృత కలశం ఉద్భవించింది. అమృతం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. రాక్షసులకు అమృతం దక్కితే వారు అమరులు అవుతారని.. అప్పుడు రాక్షసుల చేతిలో విశ్వంలో గందరగోళం ఏర్పడుతుందని శ్రీమహావిష్ణువు భావించి.. రాక్షసులకు అమృతం దక్కకుండా చేసేందుకు విష్ణువు మోహిని అనే అందమైన, మంత్రముగ్ధమైన స్త్రీ రూపాన్ని దాల్చాడు. మోహినీ రూపంలో విష్ణువు తన అందంతో రాక్షసులను మంత్రముగ్ధులను చేశాడు. రాక్షసులు మోహిని అందాన్ని చూసు మైమరచి ఉండగా.. మోహిని దేవి తెలివిగా దేవతలకు అమృతాన్ని పంచిపెట్టింది. విశ్వ సమతుల్యతను పునరుద్ధరించింది. ఈ ముఖ్యమైన సంఘటనను జ్ఞాపకం చేసుకునేందుకు.. రాక్షసులు సృష్టించే విధ్వంసం నుంచి ప్రపంచాన్ని రక్షించిన విష్ణువు మంత్రముగ్ధమైన మోహిని రూపాన్ని పూజించేందుకు మోహిని ఏకాదశి జరుపుకుంటారు.
ఇవి కూడా చదవండి
ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?
మోహిని ఏకాదశిని జరుపుకునే సంప్రదాయం విష్ణువు మోహిని రూపాన్ని తీసుకున్న తర్వాత ప్రారంభమైంది. పురాణాలలో వివరించబడిన కథల ద్వారా ఈ రోజు ప్రాముఖ్యత మరింత బలపడింది. మహాభారతంలో, శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత గురించి చెప్పాడు. పాపాలను కడిగి పుణ్యాన్ని ఇచ్చే మోహినీ ఏకాదశి గురించి వివరించాడు. మరొక పురాణం ప్రకారం సీత జాడ కోసం రాముడు వెతుకుతున్నప్పుడు.. రాముడు పాపాల నుంచి విముక్తి కోసం.. భాదల నుంచి ఉపశమనం కోసం మోహిని ఏకాదశి ఉపవాసం పాటించమని వశిష్ట మహర్షి సలహా ఇచ్చాడు.
మోహినీ ఏకాదశికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ భద్రావతి నగరానికి చెందిన పాపాత్ముడైన ధృష్టబుద్ధి గురించి. తన చెడు పనుల వల్ల అతను చాలా బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఒకరోజు అతను కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకుని.. తన పాపాల నుంచి విముక్తికి మార్గం ఏమిటని అడిగాడు. ఆ మహర్షి అతనికి వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో మోహిని ఏకాదశి ఉపవాసం ఉండాలని సలహా ఇచ్చాడు. దృష్టబుద్ధి నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఉపవాసం పాటించాడు. అందువలన అతని పాపాలన్నీ నశించిపోయాయి. చివరికి అతను మోక్షాన్ని పొందాడు. అప్పటి నుండి మోహినీ ఏకాదశి ఉపవాసం పాటించే సంప్రదాయం ప్రారంభమైంది.
ఈ కథలు.. విష్ణువు దైవిక చర్య మోహినీ ఏకాదశి ప్రాముఖ్యతను గురించి తెలియజేశాయి. ఈ రోజు చేసే ఉపవాసం, ప్రార్థనలు, విష్ణువు ఆశీర్వాదం కోరుకునే పవిత్ర దినంగా మారింది. ఈ ఏకాదశి ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం వలన ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని.. గొప్ప యాగాలు చేయడం లేదా వేల గోవులను దానం చేయడం వంటి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు