
తింటే గారెలే తినాలి..వింటే మహాభారతం వినాలి అని పెద్దల సామెత. అంటే గారెలు ఆహార పదార్థాల్లో అత్యుత్తమమైనవి అయితే పురాణాల్లో మహాభారతం అందించే జ్ఞానం అత్యుత్తం అని అర్ధం. అటువంటి మినప వడలు నేటి తరానికి తయారు చేయడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. గారెల కోసం పిండి రుబ్బడం కూడా ఒక కళే. ఎందుకంటే ఇప్పుడు రుబ్బురోల్లకు బదులుగా మిక్సీలు వచ్చాయి. కనుక మినప గారెలను తయారు చేసుకోవడానికి మినప పిండిని మిక్సీలో రుచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో గారెలు తయారు చేసుకోవడం అన్న మాటనే మర్చిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మిక్సీలో గారెల పిండిని రుబ్బుకున్నా నూనె పీల్చకుండా లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉండేలా మినప గారెలను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
మినప గారెల తయారీకి కావాల్సిన పదార్ధాలు
- పొట్టు మినప పప్పు – రెండు గ్లాసులు
- బియ్యం పిండి – రెండు స్పూన్లు
- అల్లం ముక్క – కొంచెం
- పచ్చిమిర్చి – 4
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – వేయించడానికి సరిపడా
ఇవి కూడా చదవండి
తయారీ విధానం: మినప పప్పుని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మర్నాడు మినప పప్పు మీద పొట్టు లేకుండా శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ మినపపప్పులోని నీరు లేకుండా జల్లి బుట్టులో వేసి వడకట్టుకోవాలి. ఇపుడు మిక్సీ గిన్నెను తీసుకుని అల్లం ముక్కలు, పచ్చి మిర్చి వేసి కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నానిన మినప పప్పు వేసుకుని గట్టిగా పిండిని రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీంతో గారెలు వేసుకునేందుకు మినప పిండి రెడీ అయింది.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి గారెలు వేయించేందుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత మంటని మీడియంగా పెట్టి మినప పిండిని తీసుకుని ఉండగా చేసి వడలుగా ఒత్తుకుని చిల్లు పెట్టి కాగిన నూనెలో వేసి వేయించాలి. (నేరుగా చేతితో గారెలు ఒత్తి వేయడం రాకపోతే అరటి ఆకుని గానీ పాల ప్యాకెట్ కవర్ ని గానీ తీసుకుని గారెల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేసుకోవచ్చు. ) ఇలా గారెలు నూనెలో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు గారెలు లోపల పిండి ఉడికి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉండేలా వస్తాయి. వేగిన గారెలను నూనె నుంచి తీసి ఒక ప్లేట్ లో టిష్యు పేపర్ కు తీసుకోవాలి. ఇలా చేయడం వలన గారెల్లోని అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. అంతే టేస్టీ టేస్టీ మినప వడలు రెడీ.. నచ్చిన చట్నీతో కానీ.. అల్లం చట్నీతో కానీ సర్వ్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..