
జనరేషన్ జి కేటగిరీ కి చెందిన యువత అదేనండి నేటి తరం యువత కొత్త సంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నారు. అదే మైక్రో రిటైర్మెంట్. మైక్రో ఫైనాన్స్ గురించి విని ఉంటారు. ఈ మైక్రో రిటైర్మెంట్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. ఒకప్పుడు ఏళ్ల తరబడి పనిచేసి ఆ తర్వాత ఏ 60 ఏళ్లకు పని నుంచి రిటైర్మెంట్ తీసుకునేవారు. కానీ, ఇప్పటి యువత మాకంత టైం లేదంటున్నారు. అన్నింటిలాగే ఏ పనైనా ఇప్పటికిప్పుడు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే పని నుంచి పాతికేళ్లప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ సమయంలో వీరేం చేస్తున్నారు.. ఇది వారి కెరీర్ కి లాభమా నష్టమా దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చా వంటి విషయాలు తెలుసుకుందాం..
మైక్రో రిటైర్మెంట్ అంటే..
కెరీర్ మంచి ఊపు మీదున్నప్పుడే పని నుంచి విరామం తీసుకోవడమే మైక్రో రిటైర్మెంట్. అంటే పాతిక, ముప్పై ఏళ్లలోపే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అన్నింటికన్నా మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఇక పని ఒత్తిడిని వీరు ఏమాత్రం భరించలేమంటున్నారు. అందుకు ఉద్యోగాలను సైతం వదులుకుంటున్నారు. ఈ సమయాన్ని సెలవుల కోసం ప్లాన్ చేస్తున్నారు. కొందరు యాత్రికులుగా మారి జీవితంలోని కొత్త సంతోషాలను రుచి చూస్తున్నారు.
60 ఏళ్ల వరకు ఆగలేక..
ఈ పదాన్ని 2007లో ప్రచురించిన టిమ్ ఫెర్రిస్ రాసిన “ది 4-అవర్ వర్క్వీక్” పుస్తకం ద్వారా ప్రాచుర్యం పొందింది. అయితే, వ్యక్తిగత పనుల కోసం పని నుండి పొడిగించిన విరామం తీసుకునే భావన చాలా కాలంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలి ప్రజాదరణ పెరుగుదల యువ కార్మికులలో మానసిక ఆరోగ్యం మరియు పని-జీవిత సమతుల్యతపై పెరుగుతున్న దృష్టికి కారణమని చెప్పవచ్చు. అయితే మీరు మీ సమయాన్ని తెలివిగా గడిపినట్లయితే మాత్రమే ఈ బ్రేక్ ద్వారా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచాన్ని చుట్టిరావడానికి మీకు 60 లేదా 70 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండటానికి బదులుగా… మీకు మీ యవ్వనం, మీ శక్తి, మీ ఆరోగ్యం ఉన్నప్పుడే మీరు వాటిని చేయొచ్చనేది దీని కాన్సెప్ట్. అందుకే ముఖ్యంగా కార్పొరేట్ యువత దీనికి అధికంగా ఆకర్షితులవుతున్నారు.
దీని వల్ల నిజంగానే బెనిఫిట్స్ ఉన్నాయా?
దీని ద్వారా వ్యక్తులు తమ జీవితాలపై మరింత కంట్రోల్ పొందడానికి ఇది సాయపడుతుంది. అవసరమైన విరామాలు తీసుకోవడం వారు అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసి తిరిగి కెరీర్ బాధ్యతలను పూర్తి చేస్తుంటారు. ఇది వారికి మరింత ప్రొగ్రెసివ్ గా ఉంచడానికి సాయపడుతుంది. అయితే మానసిక నిపుణుల సూచిస్తున్న దాని ప్రకారం ఇది అంత ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదని అంటున్నారు. ఎందుకంటే ఇది ఉద్యోగాలు చేసే ఇంట్రస్ట్ కు కోల్పోయేలా చేయొచ్చు. వారి స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది. వారికి పనిలో నిలకడ లేని మనస్తత్వానికి దారి తీయొచ్చు. దీనికి బదులుగా ఈ విరామం మీ వ్యక్తిగత కెరీర్ ను దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ సమయాన్ని కేవలం ఎంజాయ్ మెంట్ కోసమే కాకుండా దీనిని ఇతర స్కిల్స్ ను కూడా నేర్చుకోగలిగితే తిరిగి ఉద్యోగంలో చేరేటప్పుడు అది రెట్టింపు ఫలితాన్నిస్తుందంటున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
ఈ సమయాన్ని మంచిగా వాడుకోవగలిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, కొందరిలో ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి బదులుగా మరిన్ని టెన్షన్స్ తెచ్చిపెడుతుందంటున్నారు. దీని వల్ల మీరు తిరిగి కెరీర్ లో అదే స్థాయిలో స్థిరపడతారనే గ్యారెంటీ ఉండదు. ఇదే సమయాన్ని మీరు కెరీర్ పరంగా ఉపయోగించుకోగలిగితే మరింత మెరుగైన భవిష్యత్తును సాధించవచ్చంటున్నారు. ఒకవేళ ఈ బ్రేక్ సమయంలో మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అయిపోతే అందరికన్నా ఎక్కువ నష్టపోవాల్సి వచ్చేది మీరే. అందుకే ఈ విరామాలను ప్లాన్ చేసుకునే వారు ఈ విషయాలపై శ్రద్ధ వహించాలంటున్నారు.